శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

బీజేపీలోకి మిథున్ చక్రవర్తి!

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారా? నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయాన్ని ఆయన సందర్శించడంతో మిథున్ బీజేపీలో చేరడం ఖాయమని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ విగ్రహం ముందు అంజలి ఘటించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ పెద్దలతో సమావేశమై చర్చలు జరిపారు. అయితే ఆయన బీజేపీలో ఎప్పుడు, ఎక్కడ చేరతారనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

ప్రస్తుతం తృణమూల్ పార్టీలో కొనసాగుతున్న మిథున్ గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆయన బీజేపీలో చేరితో పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. 

పశ్చిమబెంగాల్‌లో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార తృణమూల్ పార్టీకి భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ 18 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని మమత సర్కారు కంటిమీద కునుకు దూరం చేసింది.

మిథున్ గతంలో హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, మరాఠీ, భోజ్‌పురి చిత్రాల్లో నటించారు. 350కి పైగా చిత్రాల్లో నటించిన మిథున్ అనేక అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.