గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2019 (08:09 IST)

ఓరుగల్లులో దూకుడు పెంచిన బీజేపీ

ఓరుగల్లులో బీజేపీ దూకుడు పెంచింది. సెకెండ్ క్యాడర్ తో మొదలెట్టి ఎంపీ గరికపాటితో స్పీడప్ చేసి  రేవూరి చేర్చుకోవడంతో  జిల్లాలో టీడీపీని ఫినిష్ చేశారు కమల నాథులు. మరోవైపు  మాజీ ఎమ్మెల్యే కొండేటితో కాంగ్రెస్ నుంచి వలసలు మొదలు పెట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో  బలోపేతానికి  బీజేపీ ప్రయత్నిస్తోంది.

ప్రజా క్షేత్రంలో మంచి పట్టున్న నేతలను ఆకర్షిస్తోంది. టీడీపీ ఖాళీ కావడం.. కాంగ్రెస్ లో కొందరు టచ్ లోకి రావడంతో  ఇక  టీఆర్ఎస్ నేతలపై దృష్టిపెట్టారు. త్వరలోనే జరిగే మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా బిజీపే ముందుకెళుతోంది.
 
ఉత్తర తెలంగాణకు ఆయువుపట్టుగా ఉండే వరంగల్ లో పార్టీ బలోపేతానికి ప్రత్యేక ప్లాన్ తో బీజేపీ అడుగులు వేస్తోంది. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను తమవైపు లాక్కునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

వరంగల్ అర్భన్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ జిల్లాల్లోని టీడీపీ నేతలంతా బీజేపీలో చేరిపోయారు.
 
ఇక  కాంగ్రెస్  పార్టీలో అసంతృప్త నాయకులను ప్రత్యేకంగా కలిసి ఒప్పిస్తున్నారు కమల నాథులు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు లాంటి నేతలు పార్టీలో చేరారు. మరికొందరితోనూ బీజేపీ ముఖ్యనేతలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

అటు టీఆర్ఎస్ పైనా ప్రత్యేక దృష్టిపెట్టారు కమలనాథులు. పదవులు దక్కక, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్కెట్లు రాని అసంతృప్తితో ఉన్న నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళ్తోంది బీజేపీ.

గతంలో పట్టున్న పరకాల, నర్సంపేట లో కాషాయం జెండా ఎగరేయాలని, మిగతా మహబూబాబాద్, జనగామ లాంటి ప్రాంతాల్లో సత్తా చాటాలని క్యాడర్ కు నిర్ధేశిస్తున్నట్లు సమాచారం. రేవూరితో నర్సంపేటపై పట్టుసాధించవచ్చని బీజేపీ నేతలు చెబుతున్నారు.