గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (08:36 IST)

బీజేపీ బ్రేకులకు గులాబీ బాస్ వ్యూహం!

తెలంగాణలో విప్పారుతున్న కమలానికి బ్రేక్ వేసేందుకు కారు పార్టీ అధినేత కేసీఆర్ సరికొత్త ప్రణాళికలు రచించారు. ఆదిలోనే కమలం పార్టీ ని తొక్కేయాలని వ్యూహం పన్నారు.

ఇందులో భాగంగానే మంత్రివర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. మారిన పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లాలో ఉన్న నలుగురు మంత్రుల వ్యవహారశైలి నాలుగు రకాలుగా ఉంది.

ప్రతి మంత్రినీ అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీపరంగా ఉపయోగించుకునేందుకే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేశారన్న ప్రచారం కూడా సాగుతోంది. ముందుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ విషయానికి వద్దాం. పార్టీలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఈయన ఒకరు. అయితే ఈయనకు అనుకున్న సమయంలో అనుకున్నంత ప్రాధాన్యం దక్కలేదు.

ఒక్కో సమయంలో కొప్పులకు ఒక్కో అడ్డంకి తగిలింది. అందుకే మంత్రి కోరిక నెరవేరడానికి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే కావాల్సి వచ్చింది. డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి కేటాయించారు కేసీఆర్. వాస్తవానికి కొప్పుల ఈశ్వర్‌కు తొలి ప్రభుత్వంలోనే మంత్రి పదవి ఇవ్వాల్సింది. అయితే ఉద్యమ పార్టీ నుంచి తమది ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ అన్నారు. తమ నిర్ణయాలు కూడా రాజకీయ కోణంలోనే ఉంటాయని చెప్పారు.

అందుకే పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి చేరిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల కొప్పుల ఈశ్వర్‌ను కాదనాల్సి వచ్చింది. అయితే ఆయన ఎక్కడా, ఎప్పుడూ నిరాశ చెందలేదు. నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ పోయారే తప్ప.. అసంతృప్తి వ్యక్తంచేయలేదు. ఆయన వహించిన ఓపికే రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో చోటు వచ్చేలా చేసింది.

అయితే 2018లో జరిగిన ఎన్నిక ఆయన జీవితంలో ఓ చేదు జ్ఞాపకంగా మిగిలింది. నమ్మిన అనుచరులు కొందరు ఆయన్ను వెన్నుపోటు పొడవడంతో కన్ను లొట్టపోయి గట్టెక్కారు. నాలుగువందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో మాత్రమే గెలిచారు. అది ఆయనకు గెలుపే కాదు. అయినా పార్టీని కష్టకాలంలో ఆదుకున్నందుకు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. పైగా కొప్పుల డబుల్ హ్యాట్రిక్ కొట్టడంతో గులాబీ బాస్‌కు కూడా ఇవ్వక తప్పలేదట. ఇక మరో మంత్రి ఈటల రాజేందర్‌కు రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దగా కలిసి రాలేదు.

మంత్రివర్గ విస్తరణ చేపట్టిన రోజు కేసీఆర్ అనుకున్న వారందరికీ ఫోన్లు వెళ్తున్నాయి. కానీ తొలి ప్రభుత్వంలో ఆర్థికశాఖకు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌కు మాత్రం ఫోన్ రావడంలేదు. దీంతో రెండోసారి ఈటలకు డౌటే అనుకున్నారంతా. కానీ అరగంటలో సీన్ మారింది. బాగా పొద్దుపోయాక ఈటలకు సీఎంవో నుంచి ఫోన్ వచ్చింది. ప్రమాణ స్వీకారానికి సిద్ధంకండి అంటూ కాల్ వెళ్లింది.

అయితే మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం అయితే చేశారు గానీ, ఆయనలో ముందున్నంత జోష్ లేదు. ముఖంలో పెద్దగా నవ్వులేదు. పలకరింపులోనూ ప్రేమ కనబడలేదు. సొంత నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందన్న టాక్ బలంగా వినిపించింది. మూడు నాలుగు నెలలుగా ఆయన సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇక ఇరవై రోజులుగా ఆయన మీద జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు.

కలెక్టర్ల సదస్సు వివరాలు లీక్ చేశారన్న ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అయితే ఈటల కూడా వెనక్కి తగ్గలేదు. ఎదురుదాడికి దిగారు. తీవ్ర పదజాలంతో వార్తలు రాసిన వారిపైనా, రాయించిన వారిపైనా మండిపడ్డారు.

అయితే ఇటీవల కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా కేసీఆర్ ఈటల రాజేందర్‌ను గవర్నర్‌కు పరిచయం చేస్తున్న ఫోటో మీద నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇంకొకరికి మంత్రి పదవి ఇస్తే.. ఈటల రాజేందర్‌ను పక్కన పెడతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇంకో ఇద్దరికి ఆ అవకాశం ఇచ్చినా.. ఈటల పదవికి ఢోకా లేదన్నది తాజా పరిణామంతో తేలిపోయింది.
 
ఇప్పుడు కొత్త మంత్రి గంగుల కమలాకర్ విషయానికి వద్దాం. ఈయన కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. 2009లో టీడీపీ నుంచి గెలిచిన గంగుల.. కేసీఆర్ దీక్ష తర్వాత తన మనసు మార్చుకుని టీఆర్ఎస్‌లో చేరారు. ఆయన కారు ఎక్కడంతో ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ జోరు బాగా పెరిగింది.

దీంతో అప్పటినుంచి కేసీఆర్‌కు, కేటీఆర్‌కు గంగుల కమలాకర్ చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అయితే అవసరాల రీత్యా ఆయనకు తొలి ప్రభుత్వంలో అవకాశం రాలేదు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గం ఏర్పాటప్పుడు కూడా ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. ఈటల రాజేందర్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో గంగుల కమలాకర్‌కు ఆ అవకాశం లేకుండా పోయింది.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో గంగుల కమలాకర్‌కు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. వెలమలకోట అయిన కరీంనగర్‌లో హ్యాట్రిక్ విజయం సాధించిన కమలాకర్.. చివరకు మంత్రి కావాలన్న తన కల నెరవేర్చుకున్నారు. మరోవైపు కేటీఆర్, హరీశ్‌రావులను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడంతో గులాబీశ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో వరుసగా రెండోసారి ఏర్పాటైన కేసీఆర్ ప్రభుత్వంలోనూ వీరిద్దరూ క్యాబినెట్‌లో ఉంటారని అంతా అనుకున్నారు.

అయితే అప్పుడు అనూహ్యంగా కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంతో.. ఒక్కసారిగా హరీశ్‌రావుకు ప్రాధాన్యం తగ్గించడానికే అలా చేశారని ప్రచారం జరిగింది. దీంతో కార్యకర్తలు, నేతలు డైలామాలో పడ్డారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్, హరీశ్‌రావులకు మళ్లీ అవకాశం ఇచ్చారు. నిజానికి రెండు మూడు నెలలపాటు కేటీఆర్‌ను ప్రభుత్వంలోకి తీసుకోవాలన్న డిమాండ్ బాగా వినిపించింది.

పార్టీలోని కొందరు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు కూడా.. ఆయన్ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్.. మంత్రి పదవి తీసుకుంటారా? అన్న ప్రశ్న కూడా వినిపించింది. అయితే అందరి ఊహాగానాలకు తెరదించుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మొత్తం నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు కేసీఆర్. తెలంగాణలో బలపడుతున్న బీజేపీని కట్టడి చేసేందుకే.. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

వారితో ఇతర పార్టీల నేతలు కూడా ఏకీభవిస్తూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ కరీంనగర్‌కు ఇన్ని పదవులు బీజేపీకి భయపడే ఇస్తున్నారన్న సెటైర్లు పోస్టింగ్ అవుతున్నాయి. ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ సీటు కోల్పోవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ డైలామాలో పడిందనీ, అందుకే ఇన్ని పదవులు ఇస్తున్నారనీ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నాలుగు మంత్రి పదవులే కాకుండా.. మాజీ ఎంపీ వినోద్‌కు ఇచ్చిన క్యాబినెట్ ర్యాంకు పదవిని కూడా కలిపితే మొత్తం ఐదు అయినట్లు అని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిస్థితి కొంత మారొచ్చన్న ప్రచారం సాగుతోంది.