బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (15:39 IST)

నైరుతి రుతుపవనాలు.. 24 గంటల్లో వర్షాలు.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించక ముందే వాటి ప్రభావంతో కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమటి గాలులు బలంగా వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కేరళ తీరం మీదుగా దట్టమైన మబ్బులు కమ్ముకుని ఉంటున్నాయని, ఆగ్నేయ ఆరేబియా సముద్రంపై కూడా మబ్బులు కమ్మాయని ఐఎండీ వెల్లడించింది. రాగల 24 గంటల్లో కేరళలో వర్షాలు మరింత విస్తరించే అవకాశం ఉన్నదని ప్రకటించింది.
 
ఈ నైరుతి రుతు పవనాల ప్రభావంతో పాటు.. అరేబియా సముద్రంలో ఈదురుగాల కారణంగా కేరళ సహా కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లా్లో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనుందని చెప్పారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోనూ మంచి వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
 
మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రైతులు దున్నకాలు కూడా ప్రారంభించారు. ప్రభుత్వాలు కూడా ఖరీఫ్ పంటలకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, రైతులకు రుణాలు తదితర అంశాలపై సమీక్షలు జరిపి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాయి.