బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (14:54 IST)

కడుపు తీపి.. తన బిడ్డే క్లాస్ ఫస్ట్ రావాలనీ.. ఓ తల్లి దారుణం...

poison
కడుపు తీపి ఆ తల్లిని చేయకూడని పని చేయించింది. స్కూల్‌లో తన బిడ్డే ఫస్ట్ రావాలంటూ మరో బిడ్డకు విషమిచ్చి చంపే ప్రయత్నం చేసింది. ఈ దారుణం పుదుచ్చేరి రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పుదుచ్చేరిలోని కారైక్కాల్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో రాజేంద్రన్ - మాలతి అనే దంపతుల కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి శుక్రవారం హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అతను విషం సేవించినట్టు వైద్యులు గుర్తించారు. 
 
వాచ్‌మెన్ ఇచ్చిన శీతలపానీయం తాగడం వల్లే అస్వస్థతకు లోనైనట్టు ఆ బాలుడు చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో ఓ మహిళ తనకు కూల్‌డ్రింక్స్ ఇచ్చి ఆ విద్యార్థికి ఇవ్వాలని చెప్పిందన్నారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ కూల్‌డ్రింక్స్ ఇచ్చిన మహిళను సహాయరాణి విక్టోరియాగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. 
 
ఆమె వద్ద జరిపిన విచారణలో మొదటి తరగతి నుంచి తన కుమారుడిని వెనక్కి నెట్టి రాజేంద్ర మాలతిల దంపతుల కుమారుడే ఫస్ట్ వస్తున్నాడనీ, దాన్ని జీర్ణించుకోలేక తాను విషమిచ్చానని అంగీకరించింది. దీంతో ఆమెపై హత్యాయత్నంతో పాటు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.