ముంబైలో ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల అరెస్టు
మహారాష్ట్రలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా ప్రయత్నం చేస్తున్నారన్న అభియోగాలతో ఎంపీ నవనీత్ కౌర్, అమె భర్త రవి రాణాలను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ దంపతులను బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ వెంటనే నవనీత్ రాణా దంపతుల తరపున వారి న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 29వ తేదీన విచారణ జరుగనుంది.
కాగా, హునుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని లేకుంటే తామే సీఎం నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ కౌర్ రాణా, రవి రాణాలు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన అధికార శివసేన పార్టీ కార్యకర్తలు ఖార్‌లోని నవనీత్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. ఆ తర్వాత నవనీత్ కౌర్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు, వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారన్న అభియోగాలపై ఖార్ పోలీసులు నవనీత్ కౌర్ రాణా దంపతులపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.