శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (11:54 IST)

వ్యాక్సిన్లపై అపోహలు తొలగించిన డా. రవి ఆలపాటి - లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా

లాస్ ఏంజెల్స్: అమెరికాతో పాటు భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతున్న తరుణంలో వ్యాక్సినేషన్ పైన ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించేందుకు (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) నాట్స్ వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ప్రముఖ తెలుగు వైద్యులు, గ్యాస్టో ఎంట్రాలజిస్ట్ రవి ఆలపాటి ఈ వెబినార్‌లో వ్యాక్సిన్లపై సందేహాలను నివృత్తి చేశారు.
 
ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్‌ అంతానికి వ్యాక్సినే దివ్యౌషధంగా భావిస్తున్న ప్రజలు, దానికోసం కోటిఆశలతో ఎదురుచూస్తున్న ఈ తరుణములో వ్యాక్సినేషన్ రానే వచ్చింది. మనలో చాలామందికి ఈ వ్యాక్సినేషన్ పైన వున్న పలు అనుమానాలు, అపోహలు అన్నింటినీ డా. రవి ఆలపాటి స్పష్టంగా తెలియచేసారు.
 
వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత వచ్చే స్వల్ప అస్వస్థత తాత్కలికమైనదేనని, నిర్భయంగా అందరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని ఆయన సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. అన్ని వయస్సుల వారికి వ్యాక్సిన్ ఎలా రక్షణ కలిపిస్తుందో విపులముగా డాక్టర్ రవి తెలియచేసారు.
 
ఈ వెబినార్‌కు నాట్స్ లాస్ ఏంజిల్స్ చాప్టర్ సమన్వయకర్త శ్రీనివాస్ చిలుకూరి వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ వెబినార్ ద్వారా చాలామంది తెలుగువారు వ్యాక్సిన్లపై అడిగిన ప్రశ్నలకు రవి ఆలపాటి సందేహాలను నివృత్తి చేశారు. ఆద్యంతం ఈ వెబినార్ ఎంతో ఉపయుక్తంగా జరిగిందని ఇందులో పాల్గొన్న తెలుగువారు హర్షం వ్యక్తం చేశారు.
 
భాషతో పాటు సామాజిక ఔన్నత్యానికి ఎల్లవేళలా కృషి చేసే నాట్స్ సేవలను ఇటు అమెరికాలో మరియు భారతదేశములో వేనోళ్ళ కొనియాడారు. నాట్స్ లాస్ ఏంజెల్స్ టీం ఈ వెబినార్‌ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించినందుకు,  నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శేఖర్ అన్నేలు నాట్స్ బృందాన్ని అభినందించారు.