మంగళవారం, 2 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2025 (19:16 IST)

సెక్యూరిటీ గార్డు వేతనం నెలకు రూ.10 వేలు.. రూ.3.14 కోట్లకు జీఎస్టీ నోటీసు

gst notice
నెలకు పది వేల రూపాయల వేతనం తీసుకునే ఓ సెక్యూరిటీ గార్డుకు రూ.3.14 కోట్ల జీఎస్టీ నోటీసు జారీ అయింది. ఈ నోటీసు చూడగానే ఆయన బిత్తరపోయాడు. యూపీలోని కాన్పూర్‌కు చెందిన చెందిన ఓమ్‌జీ శుక్లా అనే సెక్యూరిటీ గార్డుకు ఢిల్లీ సెంట్రల్‌ జీఎస్‌టీ శాఖ ఏకంగా రూ.3.14 కోట్ల నోటీసు పంపింది. నోటీసు ప్రకారం ఆయన  పేరుపై రూ.17.47 కోట్ల టర్నోవర్‌తో వస్త్ర వ్యాపారం నడుస్తోందని రికార్డుల్లో నమోదు చేశారు.
 
సుమారు రెండు వారాల క్రితం ఢిల్లీ సీజీఎస్టీ కార్యాలయం నుంచి ఒక పేజీ నోటీసు వచ్చినట్లు శుక్లా మీడియాకు తెలిపారు. ఆ తర్వాత ఆగస్టు 21న పోస్టుమాన్‌ మరోసారి 32 పేజీల సమగ్ర నోటీసును అందజేశాడు. అందులో ఆయన పేరు, చిరునామా, పాన్‌ నంబర్‌ ఉండటమే కాకుండా, ప్రధాన వస్త్ర వ్యాపారిగా చూపిస్తూ ఏడు రోజుల్లో పన్ను శాఖ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.
 
'నెలకు రూ.10 వేలు సంపాదించే నాకు రూ.3.14 కోట్ల పన్ను నోటీసు వచ్చింది. ఎవరో నా పాన్‌కార్డ్‌ వినియోగించి నా పేరుతో కంపెనీలు రిజిస్టర్‌ చేశారు. రూ.17 కోట్ల వ్యాపారం చేసి పన్ను చెల్లించలేదు. తొలుత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. వారు సీజీఎస్టీ అధికారులను సంప్రదించాలని చెప్పారు' అని తెలిపారు. 
 
తనపై పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక శుక్లా కాన్పూర్‌లోని సీజీఎస్టీ కార్యాలయానికి కమిషనర్‌ రోషన్‌లాల్‌ను కలిశారు. ఆయనకు పరిస్థితిని వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆయన శుక్లాను కోరారు.