సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (13:07 IST)

మంచి చేస్తే మంచే జరుగుతుందంటారు..... ఎందుకు?

మంచి చేస్తే మంచే జరుగుతుందంటారు. మీ జీవితంలో ఎదురైన మంచి అనుభవాలను, సంతోషం కలిగించిన సంఘటనలను ఎప్పుడైనా నెమరేసుకుంటున్నారా? కష్టాల్లో ఉన్న స్నేహితులకు, బంధువులకు సహాయం చేసిన ఉదంతాలను గానీ మీకు ఇతరులు చేసిన మేలును గానీ తలచుకుంటున్నారా? 
 
ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడెందుకని పెదవి విరవకండి. ఇలాంటి 'మంచి' అనుభవాలను తలచుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీన్ని ఒక అలవాటుగా మలచుకుంటే ఒత్తడి తగ్గుముఖం పడుతుందని.

ఫలితంగా భావోద్వేగాలు మెరుగుపడుతున్నాయని వెల్లడైంది. అంతేకాదు, ఇలాంటి అలవాటు గలవారిలో గుండెజబ్బు లక్షణాలూ తక్కువగా ఉంటున్నట్టు మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి మంచి అనుభవాలను నెమరు వేసుకోవటం ఆరంభించండి. 
 
పాపాయి బుడిబుడి అడుగులు వేయటం కావొచ్చు. పచ్చటి ప్రకృతి మధ్యలో వేడి వేడి కాఫీ తాగటం కావొచ్చు. ఇలాంటి చిన్న చిన్న అనుభవాలైనా సరే. మనసుకు హాయిని, ఆనందాన్ని కలిగించిన ఘటనలేవైనా చాలు. తరచుగా వాటిని నెమరు వేసుకోవటం మొదలెట్టండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గానీ రాత్రి పడుకోబోయే ముందు గానీ దీన్నొక అలవాటుగానూ మలచుకోవచ్చు. వీలైతే నోట్‌బుక్కులో రాసుకోవచ్చు కూడా. 
 
దీని మూలంగా మనసులో సానుకూల భావాలు ఉప్పొంగుతాయి. ఇవి ఒత్తిడిని తట్టుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. నిజానికి మనకు పెద్ద పెద్ద ఒత్తిళ్లే ఎదురవ్వాల్సిన పనిలేదు. రోజువారీ పనులతోనూ ఎంతోకొంత మానసిక ఒత్తిడికి గురవుతుంటాం.

సాధారణంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనకు మంచి విషయాలు అంతగా గుర్తుకురావు. ఇది మరింత ఒత్తిడికి, విచారానికి దారితీస్తుంది. ఇది ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపుతుంది. దీనికి మంచి అనుభావాలను నెమరు వేసుకునే అలవాటు విరుగడుగా ఉపయోగపడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.