శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 డిశెంబరు 2020 (18:31 IST)

తిరుమల కొండపై కనిపించని భౌతిక దూరం .. శానిటైజేషన్ అస్సలే లేదు..

కరోనా వైరస్ మహమ్మారి భయం ఇంకా వీడిలేదు. పైగా, ఈ వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఇప్పటికీ దేశంలో 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తితిదే అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. 
 
అయితే, తిరుమల గిరుల్లో కోవిడ్ నిబంధనలను భక్తులు అపహాస్యం చేస్తున్నారు. భక్తులు కనీస బాధ్యతను విస్మరించి ఇష్టారీతిన తిరిగేస్తున్నారు. ఒక్క ఆలయం లోపల తప్ప.. కొండపై మరేచోటా మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం లేదు.. శానిటైజేషన్ అస్సలే లేదు. 
 
తలనీలాలు ఇచ్చే కల్యాణ కట్టలోనూ ఇదే పరిస్థితి. భక్తులలో ఇంత నిర్లక్ష్యం కనపడుతుంటే.. అటు తిరుమల అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం. భక్తులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ.. కోవిడ్ నిబంధనలు పాటించేలా చేయడం అధికారుల బాధ్యత అని, కానీ అది కూడా ఇక్కడ లేకపోవడం విచారకరమని కొంతమంది వాపోతున్నారు. 
 
దూరాభారాలను లెక్క చేయకుండా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తుంటారు. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తరిస్తుంటారు. అలాంటి ఏడుకొండలపై కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలని.. అసలే సెకండ్ వేవ్ మొదలైందన్న వార్తల నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు అంటున్నారు.