గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (11:51 IST)

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించారు.
 
ఈ సంద‌ర్భంగా ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 13న శ్రీ ఫ్ల‌వ‌నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తుంద‌న్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తార‌న్నారు.
 
కాగా స్వామివారి మూల విరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి, నందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. అనంత‌రం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో ఆలయగోడలకు ప్రోక్ష‌ణ చేశారు. త‌రువాత స్వామివారి మూలవిరాట్టుకు అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.
 
ఈ కార్యక్రమంలో పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వెమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.