బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 17 జులై 2021 (08:18 IST)

కరీంనగర్‌లో కాల్పుల కలకలం : ఆస్తి వివాదంలో సోదరులపై కాల్పులు

జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో కాల్పుల కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి అధికార తెరాస పార్టీకి చెందిన నాయకుడు ఒకరు ఈ కాల్పులకు తెగబడ్డాడు. ఆస్తి వివాదంలో సోదరులపై ఈ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ప్రమాదం నుంచి నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. 
 
బాధితులు వెల్లడించిన వివరాల మేరకు... కరీంనగర్ పట్టణంలోని షాషామహల్‌ ప్రాంతంలో ఆస్తి వివాదంలో ఐదుగురు సోదరుల మధ్య కొద్ది రోజులుగా వివాదం సాగుతోంది. తెరాస నేత అయిన సయ్యద్‌ అజ్గర్‌ హుస్సేన్‌(పెద్ద సోదరుడు) రాత్రి 9 గంటల ప్రాంతంలో అతని చిన్న సోదరుడు సయ్యద్‌ షహీల్‌ హుస్సేన్‌పై మొదట కత్తితో దాడి చేయగా మిగతా ముగ్గురు సోదరులు అడ్డుకోబోయారు. 
 
దీంతో అజ్గర్‌ హుస్సేన్‌ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో వారిపై రెండు సార్లు కాల్పులు జరిపాడు. అయితే కాల్పుల నుంచి నలుగురు తప్పించుకోగా రెండు బుల్లెట్లు అజ్గర్‌ కారుకే తగిలాయి. సమాచారం అందుకున్న కరీంనగర్‌ అడిషనల్‌ డీసీపీ ఎస్‌ శ్రీనివాస్‌, సిటీ అడిషనల్‌ డీసీపీ పీ అశోక్‌లు సందర్శించి విచారణ జరుపుతున్నారు. 
 
అలాగే, కాల్పులు జరిపిన అజ్గర్‌తోపాటు అతని సోదరులను కరీంనగర్‌ ఒకటో ఠాణాకు తరలించి విచారిస్తున్నారు. బుల్లెట్‌ తగిలిన కారుతోపాటు కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రివాల్వర్‌ కోసం వెదుకుతున్నారు. అజ్గర్‌హుస్సేన్‌ వద్ద పీపుల్స్‌ న్యూస్‌ సర్వీస్‌ సబ్‌ఎడిటర్‌ పేరిట ఒక ప్రెస్‌ గుర్తింపు కార్డు కూడా లభించింది. ఐదుగురు సోదరులు ప్రస్తుతం షాషామహల్‌ ప్రాంతంలోని వాసవిటవర్స్‌ ముందు ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు.