బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (11:24 IST)

తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు

వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. 
 
శనివారం నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో, ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అంచనావేసింది.
 
తెలంగాణపై సముద్రమట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తువద్ద ఏర్పడ్డ ఉపరితల ద్రోణి బలహీనపడింది. మరోవైపు, ఉత్తర కోస్తా ఒడిశా నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉత్తర- దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడింది. 
 
ఈ నెల 11న పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం దగ్గర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో రాష్ర్టవ్యాప్తంగా వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలకేంద్రంలో 13.10 సెంటీమీటర్లు నమోదైంది.