శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (11:21 IST)

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. అప్లై చేసిన ప్రతి ఒక్కరికీ సీటు

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటర్‌లో సీటు కల్పించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయించింది. అవసర మైతే అదనపు సెక్షన్లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
పరిస్థితిని బట్టి బ్యాచ్‌ల వారీగా క్లాసులు నిర్వహిస్తారు. పదో తరగతిలో అందరినీ పాస్‌ చేయడం వల్ల ఇంటర్‌లో ఎక్కువ మంది చేరే అవకాశముంది. దీంతో ప్రతి ఒక్కరికీ కాదనకుండా సీటు కల్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. 
 
పైగా ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు లేకపోతే వారంతా ప్రైవేటు కాలేజీల్లో ఎక్కువ ఫీజులు చెల్లించి చేరాల్సి వస్తుంది. టెన్త్‌లో అందరినీ పాస్‌ చేసి ఇంటర్‌లో సీటు లేదని చెప్పడం సబబు కాదన్న భావన విద్యాశాఖ వర్గాల్లో ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో ఇప్పటికే 75 వేల మంది వరకు చేరారని అధికారులు చెబుతున్నారు. గడువు పెంచితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో 5.70 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాసయ్యారు. మొత్తం 2,500 వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు న్నాయి. వాటిల్లో 5 లక్షల వరకు సీట్లున్నాయి. 405 ప్రభుత్వ కాలేజీల్లో ఏటా 80 వేల మంది దాకా చేరుతుంటారు. 
 
సాధారణంగా ప్రతి కాలేజీలో సీఈసీ, హెచ్‌ఈసీ కలిపి 88 సీట్లు ఉంటాయి. బైపీసీ, ఎంపీసీకి కలిపి మరో 88 సీట్లు ఉంటాయి. డిమాండ్‌ను బట్టి సీట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులే జరుగుతున్నాయి. అందువల్ల ప్రైవేట్‌ కాలేజీల్లో చేరినా, ప్రభుత్వ కాలేజీల్లో చేరినా ఒకటేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.