బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (15:00 IST)

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామనలేదే.. మంత్రి పువ్వాడ

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని ప్రభుత్వం ఎప్పుడు చేప్పలేదని తెలంగాణా రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తేల్చి చెప్పారు.

అలాగే ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఎనిమిదో రోజుకి చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  కార్మికులు చేస్తున్న సమ్మె అనైతికమని, చట్టబద్దత లేదని వ్యాఖ్యానించారు.

కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలపై ఆయన ఎదురు దాడికి దిగారు.. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాయా అని ప్రశ్నించారు? రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతలు, కేంద్రం చేస్తున్న పనులను గమనించటంలేదన్నారు.

రైల్వేలో ప్రైవేటీకరణ విధానం బీజేపీ రాష్ట్ర నేతలకు కనిపించటం లేదా అన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. సమ్మెతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను విపక్షాలు సమర్థిస్తున్నాయా అని ప్రశ్నించారు.

కాగా, కార్మిక సంఘాల నేతలు చర్చల నుంచి ఏకపక్షంగా వెళ్లిపోయారని,  సమ్మెను ప్రయాణీకుల మీద, ప్రభుత్వం మీద బలవంతంగా రుద్దారని ఆరోపించారు..  ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం ప్రభుత్వం 7358 వాహనాలను నడుపుతోందన్నారు. బస్సులను నడిపించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామన్నారు.

త్వరలోనే అన్ని బస్సులను పూర్తిస్థాయిలో నడుపుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4416 కోట్లు మాత్రమేనని, విపక్షాల చెబుతున్నట్లుగా లక్ష కోట్లు ఆస్తులు లేవని వివరించారు..  విధానపరంగా ఆర్టీసీ ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని ఆయన గుర్తు చేశారు.

మూడేళ్ల కిందట 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తారని అనుకున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఇచ్చిందన్నారు. ఇక సమ్మె చేస్తున్న కార్మికులు టిమ్‌ మిషన్‌లు పనిచేయకుండా నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.