ఉంగరానికి ఓటు వేస్తే.. మునుగోడు అమెరికా అయిపోతుంది : కేఏ పాల్
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం బరిలో ఉన్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే, తమతమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల అధినేతలు కూడా మునుగోడులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసిన ప్రజా గాయకుడు గద్దర్‌కు మద్దతుగా ఆ పార్టీ అధినేత కేఏ పాల్ విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా, ఆయన బుధవారం ఓ హెటల్‌లో దోశ వేస్తూ కనిపించారు. చేతులతో దోశను కాలుస్తూనే...అక్కడున్న వారితో ఆయన మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో తనకు ఉంగరం గుర్తును కేటాయించారని చెప్పిన పాల్... ఉంగరం గుర్తుకు ఓటేస్తే మునుగోడును అమెరికా మాదిరిగా మారుస్తానని ఆయన చెప్పారు. 'ఉంగరం గుర్తుకు ఓటేయండి... మునుగోడును అమెరికా చేసి పారేద్దాం' అంటూ ఆయన తనదైన స్టయిల్లో చెప్పారు. ఓ వైపు పాల్ మాట్లాడుతుండగానే... ఆయన మాటలకు కౌంటర్లు ఇస్తూ జనం కూడా ఉత్సాహం చూపారు.