బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (23:06 IST)

తెలంగాణలో మే 7వరకూ లాక్‌డౌన్.. ఇబ్బంది పెడితే 100కి ఫోన్‌

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపుపై ముఖ్యమంత్రి  కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. మే 7వరకూ తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

అంతేకాదు, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్ సడలింపులు ఉండవని సీఎం ప్రకటించారు. కేబినెట్‌లో చర్చించిన అనంతరం ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని కేంద్రం ప్రకటించింది.

అయితే.. రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపుపై నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసిందని సీఎం చెప్పారు. నిత్యావసరాలు ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయని తెలిపారు. లాక్‌డౌన్ విషయంలో గతంలో ఉన్న నిబంధనలే మే 7వరకూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.

తెలంగాణలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ లాక్‌డౌన్ పొడిగింపుపై సర్వే చేశామని, పలు మీడియా సంస్థలు కూడా సర్వే చేశాయని సీఎం చెప్పారు. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోంది. పండగలు, ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.

ఎలాంటి మతపరమైన సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు మంచి సహకారం అందిస్తున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ సడలింపు ఉండదని, ఇంతకముందు ఉన్న అన్ని నిబంధనలు అమల్లో ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సడలింపులు రాష్ట్రంలో అమలు కావని, స్థానిక పరిస్థితులను బట్టి కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చని కేంద్రమే చెప్పిందని కేసీఆర్ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా డిశ్చార్జ్‌ అయ్యారని, ఇప్పుడు మర్కజ్‌ కాంటాక్ట్‌ కేసులు బయటపడుతున్నాయని కేసీఆర్‌ తెలిపారు. 
 
ఇబ్బంది పెడితే 100కి ఫోన్‌
ఉపాధి కోల్పోయి జీవనం సాగించడం కష్టంగా మారడంతో వారి పరిస్థితులను సీఎం కేసీఆర్ అర్ధం చేసుకున్నారు. ఆదివారం మంత్రి వర్గం సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి యజమానులు.. కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్‌, మే నెలల అద్దె వసూలు చేయొద్దని ఆదేశించారు.

తర్వాత నెలల్లో వాయిదాల వారీగా వసూలు చేసుకోవాలని సూచించారు. ఇది అప్పీల్‌ కాదని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారమని చెప్పారు. ఎవరైనా ఇబ్బంది పెడితే 100కి ఫోన్‌ చేసి చెప్పాలని తెలిపారు.

సతాయిస్తే ఇంటి యజమానులపై కఠిన చర్యలుంటాయన్నారు. కిరాయి వాయిదా వేశామంటూ వడ్డీ వసూలు చేయాలని చూస్తే ఊరుకోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.