ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (09:15 IST)

కరోనా ఎఫెక్టు : తెలంగాణాలో ఓపెన్ స్కూలు విద్యార్థులంతా పాస్

ప్రపంచ నుంచి గ్రామ స్థాయి వరకు కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినపడి అనేక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తికి ప్రభుత్వాలు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్టపడలేదు. దీంతో ప్రతి రంగం తీవ్రంగా నష్టపోయింది. 
 
అలాంటి వాటిలో విద్యా రంగం కూడా ఒకటి. ఈ కరోనా వైరస్ కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. వార్షిక పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడటంతో ఆయా ప్రభుత్వాలు పరీక్షలను రద్దుచేసి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ సర్కారు తాజాగా ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండడంతో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అందరినీ పాస్ చేస్తున్నట్టు తెలిపింది. 
 
అలాగే, విద్యార్ధులందరికీ ఒక్కో సబ్జెక్టులో 35 మార్కులు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ టెన్త్ చదువుతున్న 35 వేల మంది, ఓపెన్ ఇంటర్ చదువుతున్న 43 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.