శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (08:19 IST)

నేటి నుంచి వ్యాకినేషన్ షురూ : 324 కేంద్రాల్లో టీకాల వినియోగం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకాల వినియోగ జోరు సోమవారం నుంచి పెరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 324 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆరోగ్య శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి సెంటర్‌లో 50 మంది వ్యాక్సిన్‌ వేశాలా సదుపాయాలు సమకూర్చారు. 
 
టీకా తీసుకొనే వైద్య సిబ్బంది వివరాలు ఇప్పటికే కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదై ఉండగా, దశలవారీగా లబ్ధిదారుల మొబైల్‌కు సందేశాలు వెళ్తున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన రోజు, సమయం తదితర వివరాలను ముందుగా అందిస్తున్నారు. దీంతో టీకాలు తీసుకొనేందుకు వైద్య సిబ్బంది సిద్ధమవుతున్నారు. 
 
కాగా, దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌‌లో భాగంగా రాష్ట్రంలోనూ శనివారం వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం 140 కేంద్రాల్లో ఒక్కోకేంద్రంలో 30 మందికి టీకాలు వేశారు. క్రమంగా ఈ సంఖ్యను పెంచుతామని వైద్యాధికారులు చెప్పారు. సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ను నిరాటంకంగా కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. 
 
కొత్తగా 184 కేంద్రాల్లో టీకాలు వేయాలని నిర్ణయించారు. సాధారణ టీకా కార్యక్రమానికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బుధవారం, శనివారం మినహా మిగతా రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు సిబ్బందికి సవాల్‌గా మారనున్నట్టు అధికారులు చెప్తున్నారు.
 
మరోవైపు, రాష్ట్రంలో శనివారం 3,962 మందికి కొవిషీల్డ్‌ టీకాలు ఇవ్వగా, కేవలం 11 మందిలో అతి స్వల్ప లక్షణాలు గుర్తించినట్టు ప్రజారోగ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. టీకాలు వేసుకొన్నవారిలో ఆదివారం నాటికి ఎలాంటి దుష్ప్రభావాలు గుర్తించలేదని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.