సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: గురువారం, 21 నవంబరు 2019 (14:05 IST)

ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు

సాధారణంగా ప్రియురాలి కోసం ప్రియుడు ఏదైనా చేస్తుంటాడు. ఆమె ఏది అడిగినా కొని పెట్టడమే కాకుండా ఆమె కోసం ఏ పనైనా చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఒక ప్రియుడి కోసం ప్రియురాలు త్యాగం చేసింది. అది కూడా దొంగ అవతారమెత్తి దొంగతనాలు చేయడం ప్రారంభించింది. చివరకు కటాకటాల్లోకి వెళ్ళి ఊచలు లెక్కిస్తోంది.
 
హైదరాబాద్ రామాంతపూర్లో ఉండే ఝాన్సీ బంజారాహిల్స్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రాహుల్‌తో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. రాహుల్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. అతనికి డబ్బు మరింత అవసరం కావడంతో ప్రియురాలిని అడిగాడు.
 
మొదట్లో తన ఇంట్లోను, అలాగే తన అక్క ఇంట్లోను కొంత డబ్బును దొంగతనం చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది ఝాన్సీ. అయితే రాహుల్‌కు డబ్బులు ఎక్కువ అవసరం ఉండటంతో ఏకంగా బంగారు నగలనే దొంగతనం చేసేసింది. అది కూడా బుద్ధానగర్ లోని తన అక్క ఇంట్లో. దొంగతనం తరువాత తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించింది.
 
బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. తన చెల్లి బంగారు నగలను దొంగిలించిందని తెలుసుకున్న అక్కతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. కేసును మాత్రం వెనక్కి తీసుకోకపోవడంతో ఝాన్సీతో పాటు రాహుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నాలుగు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.