శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (20:38 IST)

జొన్నరొట్టెలు తిని.. ముగ్గురు మృతి.. భిక్షమెత్తి తెచ్చిన పిండితో..

సంగారెడ్డి జిల్లాలో కలుషితాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని వట్ పల్లి మండలం, పల్వట్లలో నివాసం ఉండే జంగం కులానికి చెందిన శంకరమ్మకు ముగ్గురు కొడుకులు వారంతా ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. శంకరమ్మ ఊరిలో భిక్షమెత్తుకుని వచ్చినదానితో తిని జీవించేది.
 
వారం రోజుల క్రితం అలా అడుకొచ్చిన జొన్న పిండితో శంకరమ్మ రొట్టెలు చేసుకుని తింది. ఆ తర్వాత శంకరమ్మ అస్వస్థతకు గురై మరణించటంతో హైదరాబాద్ లోని కొడుకులు పల్వట్ల గ్రామానికి వచ్చి తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు ముగిసిన 5 రోజుల తర్వాత ఆమె ఇద్దరు కొడుకులు, ముగ్గురు కోడళ్లు సోమవారం ఇంట్లో ఉన్న జొన్న పిండితో రొట్టెలు చేసుకుని తిన్నారు.
 
రాత్రి 10 గంటల సమయంలో నిద్ర పోవటానికి సిధ్దమవుతుండగా వారికి ఒక్కసారిగా వాంతులు విరేచనాలు అవటం మొదలైంది. వెంటనే వారిని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే శంకరమ్మ రెండో కొడుకు చంద్రమౌళి కన్నుమూశాడు. మిగిలిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి, బీబీఆర్ ఆస్పత్రికి తరలించారు.
 
కాగా మార్గమధ్యలోనే శంకరమ్మ మూడో కుమారుడు శ్రీశైలం కూడా మృతి చెందాడు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన శంకరమ్మ పెద్ద కోడలు సుశీల ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. కాగా వీరి కుటుంబంలోని మరో ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్ధితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.
 
కాగా.. జొన్నపిండితో చేసిన రొట్టెలు తిని కుటుంబ సభ్యులందరూ మృత్యవాత పడటంతో ఆ పిండిని పరీక్షల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.