గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో విషాదం : రోలింగ్ షట్టర్‌లో చిక్కుకుని..
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి అంజయ్య నగరులో బుధవారం విషాదకర సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తూ ఆటోమేటిక్ రోలింగ్ షట్టర్‌లో చిక్కుకొని బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గచ్చిబౌలిలోని టీవీఎస్ షోరూం భవనం వద్ద బాలుడు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో షట్టర్ ఆటోమేటిక్ రోలింగ్ బటన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆన్ చేశారు.
దీంతో ఒక్కసారిగా షట్టర్ చుట్టేయడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి అర్జున్ కాంప్లెక్స్‌లోనే వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఈ ప్రమాదానికి షోరూం నిర్వాహకులు, భవన యజమాని నిర్వాహకులే కారణమని ఆరోపిస్తున్నారు. వాచ్‌మెన్ కుమార్తెకు కూడా గతంలో విద్యుత్ షాక్ తగిలిందని, అప్పుడు సురక్షితంగా ఈమె బయటపడినట్లు తెలిసింది.
పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.