మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 12 మే 2021 (22:53 IST)

ఈటెల రాజేందర్ దారెటు, కేసీఆర్ వైరి వర్గాన్ని కలుస్తూ బిజీబిజీగా...?

తెలంగాణ మాజీ వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పొమ్మనకుండా పొగపెట్టారు టిఆర్ఎస్ పార్టీ నేతలు. ఏకంగా మంత్రి పదవి నుంచి తొలగించేశారు. భూకబ్జా వ్యవహారం ఈటెల మెడకు చుట్టుకోవడంతో అవినీతి మంత్రులు తన కేబినెట్లో ఉండకూడదని కెసిఆర్, కెటిఆర్ కలిసి తొలగించారు.
 
ఈటెలను తొలగించడంతో ప్రధాన పాత్ర కెటిఆర్‌దేనన్న ప్రచారం బాగానే సాగింది. తెలంగాణా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈటెలను పక్కా ప్రణాళికలతో తొలగించారని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈటెల ఏ పార్టీలోకి వెళతారన్నది ఆశక్తిగా మారుతోంది.
 
మొదటగా రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్‌ను కలిశారు ఈటెల. వీరిద్దరి మధ్య గంటన్నరకి పైగా చర్చ జరిగింది. చాలా గోప్యంగా వీరిద్దరు కలిశారు. ఆ తరువాత బిజెపి ఎంపి అరవింద్‌ను కలిశారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న నేతలందరినీ వరుసగా కలుస్తున్నారు ఈటెల.
 
అయితే తెలంగాణా రాష్ట్రంలో టిఆర్ఎస్ తరువాత ఆ స్థాయిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని.. కాబట్టి ఆ పార్టీలోకి రావాలని నేతలను ఒత్తిడి తెస్తుంటే బిజెపి లాంటి జాతీయ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనలో ఈటెల ఉన్నారట. ఈటెల సన్నిహితులు కూడా అదే చెబుతున్నారట. మరి చూడాలి ఈటెల రాజేందర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది.