చిరంజీవి 'ఆచార్య' చిత్రంలో విలన్‌గా రియల్ హీరో!!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదాపడింది. అయితే, ఈ చిత్రంలోని విలన్ పాత్రకు అనేక మంది పేర్లను చిత్ర యూనిట్ పరిశీలించింది. కానీ, చివరకు వెండితెరపై విలన్‌గా, నిజ జీవితంలో రియల్ హీరోగా మారిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ను తాజాగా సంప్రదించినట్టు సమాచారం.
కరోనా కష్టకాలంలో సోనూ సూద్ అనేక మందికి కేవలం దేశంలోనే కాదు.. విదేశాల్లోని భారతీయులకు సైతం తన వంతు సాయం చేశాడు. ముఖ్యంగా, కరోనా కష్టాల్లో చిక్కుకున్న అనేక మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చాడు. అలాగే, మరికొందరికి మరో విధంగా ఆపన్నహస్తం అందించాడు. అలా వెండితెర విలన్ ఇప్పుడు నిజజీవితంలో 'హీరో' అయ్యాడు.
తాజాగా ఏపీలో ఓ పేద రైతు తన ఆడపిల్లలను కాడెద్దులుగా మార్చి దుక్కిదున్నుతున్న ఫొటోలను చూసి చలించిపోయి ఆగమేఘాలపై ఎనిమిది లక్షలతో వారికి ట్రాక్టర్ కొనివ్వడం.. ఇంటువంటి ఎన్నో సత్కార్యాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ ఆపత్కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం సోనూ సూద్ సుమారు 10 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేసినట్టు సమాచారం.
ఇదిలావుంటే, చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య'లో ప్రధాన విలన్ పాత్ర కోసం ఆయనను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆయన కూడా పాత్ర నచ్చడంతో ఈ చిత్రం చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక మొదలవుతుంది.