శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శనివారం, 20 ఏప్రియల్ 2019 (17:56 IST)

కసక్... రేప్‌కి యత్నించిన వాళ్లవి కోసేయాలి... యాంకర్ రష్మి గౌతమ్

యాంకర్ రష్మి గౌతమ్ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా వుంటారు. మహిళలపై తరచూ జరుగుతున్న లైంగిక దాడులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో కొందరు కామాంధులు ఓ యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో ఆమెపై యాసిడ్ దాడి చేశారు. దీనిపై రష్మి స్పందిస్తూ... ఇలాంటివాళ్ల వ్యక్తిగత భాగాలను కోసేయాలి. లేదంటే... రాత్రికిరాత్రే మహిళా జాతి అదృశ్యమవ్వాలి. అప్పుడుగాని స్త్రీ యొక్క విలువ తెలుస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
కాగా బీహార్‌లో కొందరు కామాంధులు రెచ్చిపోయారు. ఓ తల్లి కళ్ళెదుటే ఆమె కుమార్తెపై లైంగికదాడికి యత్నించారు. కన్నతల్లి కణతపై తుపాకీ గురిపెట్టి.. ఆమె కుమార్తెను వేధించారు. చివరకు ఆ యువతి ప్రతిఘటించడంతో ఏం చేయలేని దుండగులు... ఆ యువతి ముఖంపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు.
 
ఈ దారుణం శుక్రవారం రాత్రి బీహార్ రాష్ట్రంలోని భాగల్పూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భాగల్పూరుకు చెందిన 17 యేళ్ళ యువతి కన్నతల్లితో కలిసి నివసిస్తోంది. స్థానికంగా ఉండే ఓ కాలేజీలో 11వ తరగతి చదువుతోంది. ఆ యువతిపై అదే ప్రాంతానికి ప్రిన్స్ అనే వ్యక్తి ఆ యువతిపై కన్నేశాడు. ఈ క్రమంలో ఆ యువతిని పలుమార్లు వేధించాడు కూడా. అయినప్పటికీ ఆ యువతి మాత్రం లొంగలేదు.
 
దీంతో శుక్రవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులను ఇంటికి పిలిపించి... యువతి ఇంట్లోకి చొరబడి ఆమెను లైంగికంగా వేధించారు. అడ్డొచ్చిన తల్లిపై కూడా దాడి చేశారు. ఆమె కణతపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. అరిస్తే తుపాకీతో కాల్చి చంపేస్తానని బెదిరించాడు. అనంతరం వేధింపులను కొనసాగించాడు. అయితే ప్రిన్స్ వేధింపులను యువతి ప్రతిఘటించడంతో నిందితులు రెచ్చిపోయారు.
 
తమ వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను యువతి ముఖంపై పోసి పరారయ్యారు. యాసిడ్ మంట తాళలేక యువతి కేకలు వేయడంతో స్థానికులు, ఇరుగుపొరుగు వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలంలో యాసిడ్ బాటిల్‌తో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు ప్రిన్స్‌ను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.