అమెరికా వెళ్లిపోతున్నా.. మీటూ ఆరోపణలు ఏమౌతాయ్
మీటూ ఆరోపణలతో దేశంలో సంచలనం సృష్టించిన తను శ్రీ దత్తా అమెరికా వెళ్లిపోతుందట. తన భవిష్యత్తు అక్కడే వుందని.. నెల రోజులు వుందామనే ముంబైకి వచ్చానని తెలిపింది. కానీ ప్రస్తుతం ఐదు నెలలు దాటేసిందని చెప్పుకొచ్చింది. దీంతో మీటూ ఆరోపణలకు సంబంధించి తను శ్రీ దత్తా ఇచ్చిన ఫిర్యాదులు, కేసులు ఏమౌతాయోనని సినీ పండితులు అడుగుతున్నారు.
తొలుత మీటూ ఉద్యమంలో ఎవరి పేర్లను బయటపెట్టని తను శ్రీ తనను వేధించిన వారి పేర్లను మీడియా ముందు చెప్పేసింది. నటుడు నానా పటేకర్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వంటి సెలబ్రిటీలు తనను లైంగికంగా వేధించారని చెప్పింది. దీంతో బాలీవుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగిన సంగతి తెలిసిందే.
తనుశ్రీని స్పూర్తిగా తీసుకున్న కొందరు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను కూడా బయటపెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చాలామంది దర్శకులు, నిర్మాతలు, హీరోల మీద ఆరోపణలు వచ్చాయి. మీటూ ఉద్యమం బాలీవుడ్‌లో భారీ ఎత్తున ఉద్యమించడానికి కారణమైన తనుశ్రీ ఇప్పుడు అన్నీ వదిలేసి తిరిగి అమెరికా వెళ్లిపోతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది.