పెర్త్‌లో ఊరిస్తున్న విజయం : ఆసీస్ 243 ఆలౌట్.. భారత్ లక్ష్యం 287
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ముంగింట మరో విజయం ఊరిస్తోంది. పెర్త్ వేదికగా సాగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. ఆసీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ ముంగిట 287 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఏకంగా ఆరు వికెట్లు తీయగా, బుమ్రా మూడు వికెట్లు, ఇషాంత్ ఒక వికెట్ తీశాడు.
దీంతో ఈ మ్యాచ్‌లో విజయం భారత్‌ను ఊరిస్తుందని చెప్పొచ్చు. పైగా, ఈ మ్యాచ్ దాదాపు ఒకటిన్నర రోజు మిగిలివుంది. భారత జట్టులోని ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లు రాణిస్తే మాత్రం టీమిండియా ఖాతాలో మరో విజయం నమోదైనట్టే. ఇప్పటికే తొలి టెస్టులో భారత్ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే.
పైగా, తొలి ఇన్నింగ్స్‌లో కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అలాగే, రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తే భారత జట్టు గెలుపు నల్లేరుపై నడకేనని చెప్పొచ్చు. అయితే, భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రాహుల్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత తొలి వికెట్‌ను కోల్పోయింది.