శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 21 జనవరి 2017 (05:23 IST)

చిరంజీవి, బాలయ్య.. సినిమాల్లోనేనా.. నిజజీవితంలోనూ ప్రజలకు అండగా నిల్చేదేమైనా ఉందా?

సంక్రాతి తెలుగు సినిమాకి పెద్ద పండగ.ఈసారి ప్రత్యేకించి చాలాకాలం తర్వాత చిరంజీవి .బాలకృష్ణ సినిమాలు పోటీలో ఉండటం,అందులోనూ చిరంజీవిది 150 సినిమాకావడం బాలయ్యది 100 సినిమాకావడం వారి అభిమానులకి పండగ 2 రోజుల ముందే వచ్చింది. అయితే ఇక్కడ చర్చ అంతా వారు సాధిం

సంక్రాతి తెలుగు సినిమాకి పెద్ద పండగ. ఈసారి ప్రత్యేకించి చాలాకాలం తర్వాత చిరంజీవి .బాలకృష్ణ సినిమాలు పోటీలో ఉండటం, అందులోనూ చిరంజీవిది 150 సినిమాకావడం, బాలయ్యది 100 సినిమాకావడం వారి అభిమానులకి పండగ 2 రోజుల ముందే వచ్చింది. అయితే ఇక్కడ చర్చ అంతా వారు సాధించే కలక్షన్స్, బద్దలు కొట్టే రికార్డులు చుట్టే తిరుగుతోంది. ఇక్కడ చర్చించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు సినిమాలో చూపించే విషయాలు బయట సమాజంలో జరుగుతున్నప్పుడు వారి స్పందన ఏమిటి...? వారు కేవలం సినిమా నటులు మాత్రమే అయితే వారి స్పందన గురించి చర్చ అవసరం లేదు.. కానీ వారు గౌరవప్రద ప్రజాప్రతినిదులు, మనని పాలించే చట్టసభల్లో సభ్యులు కాబట్టి చర్చ అవసరం. అందులోనూ వీరు రాజకీయాల్లో పదవులు పొందటానికి కారణం సినిమా వల్ల వచ్చిన క్రేజ్ కారణం, సినిమాలో ప్రజల తరపున నిలబడే వీరు నిజజీవితంలో కూడా తమకి అండగా ఉంటారని ఆశించటం వల్లే వారు రాజకీయాల్లో రాణిస్తున్నారు. మరి వారు ప్రజల నమ్మకాలని నిలబెట్టుకుంటుంది ఎంత..
 
చిరంజీవి 150 వ సినిమా రైతుల భూములు కార్పొరేట్ కంపెనీలు లాక్కొనే విషయంలో భూమిని కోల్పోయే రైతు పడే బాధని కథగా ఎంచుకొని తీసిన సినిమా. ఇది తమిళ కత్తి సినిమాకి రీమేక్. ఆ సినిమాలో చర్చించిన కొన్ని రాజకీయ అంశాలని ఇక్కడ కట్ చేసి తీశారు.. సరే వాటికి ఉండే కారణాలు ఏమైనా ఇది రగులుతున్న వర్తమాన సమస్య .అభివృధి పేరుతో రైతుల భూమిని లాక్కొని ,పండించే రైతుని దాని మీద ఉపాధి పొందే చాలా మందిని అంధకారంలో కి నెట్టే పరిస్థితి. తెలంగాణలోని మల్లన సాగర్ నుండి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ,బందరుపోర్టు , ఉత్తరాంధ్ర లో న్యూకియర్ ప్లాంట్ , దివీస్ ఇలా చాల చోట్ల భూమిని కోల్పోతున్న రైతు సమస్యలు ఉన్నాయి. ప్రజలు ఎప్పటికప్పుడు వీటిమీద పొరాడుతూనే ఉన్నారు.. మరి ఇక్కడ సమస్యని సినిమాలో చెప్పిన చిరంజీవి నిజజీవితంలో వీరికి అండగా నిలుస్తారా? ఈరోజు 2013 భూసేకరణ చట్టానికి తెలుగు ప్రభుత్వాలు తూట్లు పొడుస్తునాయి. నిజానికి దీనిమీద చిరు మాట్లాడాలి? ఎందుకంటే ఇది పార్లమెంట్లో పాస్ అయినప్పుడు మెగాస్టార్ ఆ పార్లమెంటులో సభ్యుడిగా, కేంద్రమంత్రిగా కుడా ఉన్నారు. ఇప్పటివరకు ఈ విషయాల మీద చిరు స్పందనలేదు.. తెర మీద రైతు నాయకుడిగా కార్పొరేట్‌కి వ్యతిరేకంగా నిలబడ్డ చిరంజీవిని బయటకూడా తమ తరపున కొట్లాడి తన సామాజిక భాద్యత నిలబెట్టుకోవాలి. అప్పుడే తనలోని నటుడికి కాక ప్రజాపతినిది పొజిషన్‌కు కూడా న్యాయం చేసినట్లు అవుతుంది.
 
ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే ఇది అఖండ భారతాన్ని ఏకం చేసి పాలించిన ఒక అమరావతి రాజు కథ. రాజ్యాన్ని నీవు పాలించినా...నేను పాలించినా తప్పు లేదు. ఒకే ఖండం వారిమే, కానీ పరాయి దేశానికీ తలుపులు తెరిచావ్ చూడు అది తప్పు- ఇది గౌతమిపుత్ర శాతకర్ణి లో బాలయ్య చూపిన డైలాగ్. మరి శాసనసభ్యుడిగా నిజజీవితములో బాలయ్య శాతకర్ణి రాజధర్మం కోసం నిలబడుతున్నాడా? నేడు అమరావతి రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకి అప్పగించారు. మరి అమరావతి రాజు కోరుకుంది ఇదేనా? నేడు ఢిల్లీ నుండి గల్లీ వరకు వీరి వ్యాపార సామ్రాజ్యం ఉంది. నాడు నేడు పాలకులు విదేశీ సామంతులుగానే ఉన్నారు. నాడు విదేశీయులు అధికారంతో పాలిస్తే నేడు వ్యాపారంతో పాలిస్తున్నారు. వారు వారి అవసరాలకోసం ఇచ్చే నాలుగు గుమాస్తాగిరీ ఉద్యోగాలు చూపించి అభివృద్ధి అంటుంటారు. మనదేశం విదేశీ కంపెనీలకు  వినియోగదారుల కేంద్రంగా మారింది.. మన ప్రతి రంగంలోకి ఎఫ్ డి ఐ లు వచ్చి చేరాయి. మరి నాడు గౌతమిపుత్రుడు చేసిన పోరాటం నేడు నందమూరి పుత్రుడు చేస్తాడా?
 
వీరు కేవలం సినిమా నటులు మాత్రమే అయితే ఇవ్వన్నీ మనం అడగం. కాని వారు అలా కాదు కదా. సినిమా నటులకి బాగా నటించడం మాత్రమే బాద్యత కావొచ్చు. కానీ ప్రజా జీవితములోకి వచ్చాక అది పెరుగుతుంది. ప్రతి విషయంలో ప్రజల తరపున నిలబడకపోయినా పర్లేదు కనీసం వారు సినిమాలో చూపించిన సందర్భం బయట ఎదురైనప్పుడు నిలబడాలి కదా .తెర మీద అన్యాయాన్ని ఎదిరించే హీరోయిజం చూసి చపట్లు కొట్టే జనం బయట కుడా వారిని అలాగే కోరుకుంటారు. అందుకే సినిమావాళ్ళకి రాజకీయాల్లో కూడా పట్టం కడుతున్నారు ప్రజలు. మరి దీనిని వారు నిలబెట్టుకొవాలి.