ఆదివారం, 24 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (13:37 IST)

ఎన్టీఆర్‌ తో కొరటాల శివ దేవర తో సక్సెస్ ఇచ్చాడా? లేదా? . దేవర రియల్ రివ్యూ

Devara latest
Devara latest
నటీనటులు : ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు.
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్, నిర్మాత : మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు : కొరటాల శివ
 
రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు సరైన విజయం వస్తుందోలేదో అని గుసగుసలు సినీప్రియుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ వినిపిస్తుంటాయి. కానీ ఎన్టీఆర్‌  యాక్షన్‌ డ్రామా ‘దేవర’ సముద్రపు దొంగలు నేపథ్యం అని ఎర్రసముద్రంలో రక్తం ఏరులై పారుతుందనీ, భయం అంటే తెలీని జాతికి భయం, బతుకు ఏమిటో తెలియజేసిన దేవర కథే అని ముందుగానే దర్శక నిర్మాతలు తెలియజేయడంతో ఇదేదో కొత్తగా అనిపిస్తుంది అనేలా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు. మరి ఈ రోజే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
 
కథ :
సెంట్రల్ మినిస్టర్ పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి యతి అనే గ్యాంగ్ లీడర్ ను పట్టుకోవాలనీ, లేదంటే దేశంలో జరిగే ఇంటర్ నేషనల్ ఆటలపోటీలకు అంతరాయం ఏర్పడుతుందని చెబుతాడు. అలా యతికోసం బయలుదేరిన టీమ్ అజయ్ బయట ప్రపంచానికి దూరంగా వుండే నాలుగు ఊళ్ళయిన ఎర్ర సముద్రం వైపు వస్తాడు. అక్కడ దేవర కథ తెలుసుకోవాల్సివస్తుంది. 
 
రాజులకాలంలో పెంచి పోషించిన ఎర్రసముద్రం సైన్యం ఆ సామ్రాజ్యానికి అండగా నిలుస్తారు. కాల్రకమంలో వారంతా బ్రిటీష్ వారు కొల్లగొడుతున్న దేశసంపదను సముద్ర మార్గంలో అటకాయించి  సామాన్యులకు పంచుతుంటారు. మారిన పరిస్థితుల వల్ల వారి వారసులుగా వున్న దేవర (ఎన్.టి.ఆర్.,) భైర (సైఫ్ అలీఖాన్),శ్రీకాంత్ ఓ గ్యాంగ్ గా ఏర్పడి షిఫ్ లో వచ్చే కంటైనర్లను కొల్లగొట్టి వ్యాపారస్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఓసారి తాము చేసింది ఎంత తప్పిదమో తెలుసుకున్న దేవర ఇకపై ఇలాంటి దోపిడీలు ఆపేయాలి శాసిస్తాడు. ఇది నచ్చని బైర బ్యాచ్ దేవరపై ఎటాక్ చేస్తారు. అప్పటినుంచి దేవర కనిపించడు. ఆ తర్వాత దేవర కొడుకు వర ద్వారా దేవరను పట్టుకోవాలని సముద్రంలోకి పంపిస్తాడు బైర. ఆ తర్వాత ఏమిజరిగింది? బైర ఎత్తుపారిందా? లేదా?  వరతో తంగం (జాన్వీ కపూర్) ప్రేమ కథ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
చూడగానే ఇదో రాబిన్ హుడ్ కథని తెలిసిపోతుంది. అందుకే మనకు తెలీని ప్రపంచాన్ని, కొత్త లోకాన్ని, కొత్త సాంకేతికత జోడించి ప్రేక్షకుల్ని మైమరిపించేలా చేస్తే కనెక్ట్ అవుతారు. బాహుబలి నుంచి సలార్ వరకు జరిగిన తంతు అదే. కానీ అలా కొత్త లోకాన్ని చూపించి ఆచార్యతో బెడిసికొట్టిన కొరటాల శివ ఈసారి ఎన్.టి.ఆర్. తో చేసిన ప్రయోగమే దేవర. అందుకే పంతం పట్టి మరీ దేవర లాంటి సముద్రపు దొంగల కథను ఎంచుకున్నాడు. అయితే ఈసారి దేవర ప్రపంచం మైమరిపించేలా చేయదు. అలా అని నిరుత్సాహ పరచదు. ఒకరకమైన టైం పాస్ సినిమాగా చెప్పవచ్చు.
 
లవకుశలాంటి సినిమాలో మూడు పాత్రల వేరియేషన్ చూపించి శభాష్ అనిపించిన నటుడు ఎన్టీఆర్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు.  దేవర, వరద (వర) పాత్రల్లో కూడా ఆకట్టుకున్నాడు. ప్రధానంగా దేవర పాత్రే సినిమాకు కీలకం. ధైర్యం, భయం రెండూ పాత్రలో తేడాను బాగా చూపించాడు. అయితే యాక్షన్ సన్నివేశాల్లో బిల్డప్ పెద్ద వర్కవుట్ కాలేదు. హింస ఎక్కువగా వుంది. భావేద్వేగాలు పాత్రల్లో కనిపిస్తున్నా ప్రేక్షకుల్లో అంత ఫీల్ కనిపించదు. పైగా దేవర చనిపోయాడనీ, చంపింది ఆయన కొడుకే అన్న షాట్స్ ముగింపులో చూపించి కథలో కొత్తదనం  వుందని చెప్పే ప్రయత్నం చేసినా అది బాహుబలిలో కట్టప్ప షాట్ గుర్తుకు తెస్తుంది. ఇక ఎర్రసముద్రం ప్రపంచం ఛాయలు కొన్నిసార్లు ఆచార్య సినిమా పోలికలు కనిపిస్తాయి.
 
మొదట్లో చూపిన ఎర్రసముద్రం కొత్త లోకానికి వెళ్ళినట్లుంటుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ నేపథ్యసంగీతం ప్రేక్షకులను ఇన్ వాల్వ్ చేస్తుంది. వర పాత్ర తీరు కాస్త నిరుత్సాహపరిచినా చివరిలో కాస్త హుషారు తెప్పిస్తుంది. కానీ జాన్వీ కపూర్ పాత్ర ఏమంత ప్రత్యేకంగా లేదు. కేవలం ద్వందార్థాలతో నలుగురు ఫ్రెండ్స్ వెంటేసుకోవడం, జలకాలడడం మినహా ఆమెకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి.
 
సాంకేతికపరంగా చూస్తే, విజువల్ ఎపెక్ట్స్, సినిమాటోగ్రఫీ, అనిరుద్ సంగీతం, ఆర్ట్ డిపార్ట్ మెంట్ కొత్త లోకాన్ని చూపిస్తాయి. దర్శకుడిగా కొరటాల పాత తరహాలోనే వెళ్ళాడు. కొత్తగా కథంటూ ఏమీలేదు. కథనాన్ని మరింతగా ఎట్రాక్ట్ చేసేలా తీస్తే బాగుండేది. రెండు భాగాలుగా వున్న ఈ సినిమాను ఒక్క పార్ట్ లో చెప్పేయవచ్చు అనిపించేట్లుగా సినిమా వుంది. అసలు దేవరను చంపే ధైర్యం ఎవరికి వుంది? అంటూ అజయ్ అన్న డైలాగ్ తో సినిమా ఎండ్ అవుతుంది. ఆ తర్వాత కొడుకే చంపినట్లుగా చిన్న షాట్ చూపిస్తారు. ఇదంతా బాహుబలి సీక్వెల్ గా వుంది. రాజమౌళి తరహాలోనే దాయాదుల కథను ఎంచుకున్నా బాగుండేది. ఆ తరహాలో వెళ్ళి కొత్త ప్రయోగం చేయాలన్న తపన దర్శకుడిలో కనిపిస్తుంది. 
 
షార్క్ తో పోరాటం, సముద్రంలో యాక్షన్ సన్నివేశాలు సాంకేతికతో బాగా చూపించారు. 90ల కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.  అయితే  కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు కొరటాల శివ, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. దానితో సినిమా సాగతీతగా అనిపిస్తుంది. 

నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే  ఎన్టీఆర్ అభిమానులను అలరిస్తుంది. యాక్షన్ సినిమాలు చూసేవారికి నచ్చుతుంది. వారిని బట్టి ఈ సినిమా ఎంత రేంజ్ వుంటుందో తెలియాల్సి వుంది.
రేటింగ్ : 3/5