శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 21 సెప్టెంబరు 2020 (22:19 IST)

తిరుమల శ్రీవేంకటేశుని పాదాల నుంచి వచ్చే తీర్థం...

పూర్వం తుంగభద్రనదీ తీర్థంలో పద్మనాభునిపుత్రుడైన కేశవుడనే బ్రాహ్మణ యువకుడు వేశ్యాలంపటుడయ్యాడు. ధనం మీద దురాశతో ఒక విప్రుని చంపాడు. ఆ మరుక్షణమే బ్రహ్మహత్యాపాపం భయంకర రూపంతో అతని వెంట పడింది. కేశవుడు భయంతో దేశాలన్నీ తిరుగుతూ, తన తండ్రి కాళ్లపై పడి రక్షించమని ప్రార్థించాడు. 
 
అదే సమయానికి అక్కడికి వచ్చిన భరద్వాజ మహర్షి కటహ తీర్థమహిమను తెలియజేసి, ఆ తీర్థాన్ని సేవింపజేయమని ఆనతిచ్చాడు. కేశవ వర్మ తండ్రితో కూడా కూడా తిరుమల క్షేత్రాన్ని చేరుకుని శ్రీస్వామివారి కోనేట్లో స్నానమాచరించాడు. తరువాత వరాహస్వామిని దర్శించుకున్నాడు. 
 
అటు తర్వాత శ్రీవేంకటేశ్వరుని దర్శించి, పిదప శ్రీ స్వామివారి పాదాల నుండి స్రవించే కటాహతీర్థాన్ని స్వీకరించి బ్రహ్మహత్యాది మహాపాపాలను తొలగించుకున్నాడు. అలాగే కర్మరోగాలను కూడా పోగొట్టుకున్నాడు. ఈ కటాహతీర్థ జలాన్ని ఎవరైనా పానం చేయవచ్చుని, స్పర్శదోషం లేని ఆ తీర్థం, బ్రహ్మహత్యాది మహాపాపాలను తొలగించడమే కాకుండా, కర్మరోగాలైన భయంకర వ్యాధులను కూడా పోగొడుతుందని స్కందపురాణంలో చెప్పబడింది.