శాంతించు కరోనా దేవీ, కరోనాకు ఆలయం, నిత్యార్చన, యాగాలు (video)
కరోనాకు ఆలయమేంటని విచిత్రంగా అనుకోవచ్చు. ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే ఆలయాన్ని కట్టి ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఎప్పుడూ వెరైటీగా ఉండే తమిళ ప్రజలు ఈసారి ఏకంగా కరోనాకు ఆలయం కట్టారు. కరోనా దేవిగా నామకరణం చేసేశారు.
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నగరంలోనే కరోనా దేవి ఆలయం కట్టేశారు. విగ్రహం పెట్టారు. ఇద్దరు అర్చకులను నియమించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా నిత్యార్చనలు, పూజలు చేసేస్తున్నారు. కరోనా దేవికి శాంతిపూజలు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు.
కరోనా విజృంభణ తగ్గించు.. శాంతించూ అంటూ మంత్రాలు కూడా చదువుతున్నారట. కోయంబత్తూరులో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానికులే ఆలయాన్ని కట్టించాలని నిర్ణయించుకున్నారట. విరాళాలను స్థానికులే సేకరించి ఆలయాన్ని కట్టేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కోయంబత్తూరులో కరోనాకు ఆలయం కట్టడంపై పెద్ద చర్చే జరుగుతోంది.