గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 డిశెంబరు 2020 (12:34 IST)

క్షమించండి, నేను పార్టీ పెట్టలేను, నాకు అనారోగ్యం అందుకే: రజినీకాంత్ సంచలనం

తమిళనాడులో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో రాజకీయ పార్టీ పెడతానంటూ చెప్పిన రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తను రాజకీయ పార్టీని పెట్టడంలేదని ఓ సుదీర్ఘ లేఖ ద్వారా తెలియజేసారు.
 
ఇటీవలే హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రెండు రోజుల తరువాత ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. "నేను రాజకీయాల్లోకి ప్రవేశించలేనని తీవ్ర విచారంతో చెప్తున్నాను, ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నప్పుడు నేను పడుతున్న బాధ నాకు మాత్రమే తెలుసు. రాజకీయాల్లోకి ప్రవేశించకుండా, నేను ప్రజలకు సేవ చేస్తాను. నా ఈ నిర్ణయం నా అభిమానులను మరియు ప్రజలను నిరాశపరుస్తుంది, కాని దయచేసి నన్ను క్షమించండి" అని వెల్లడించారు.
 
రెండేళ్ల క్రితం రజినీ మక్కల్ మండలం ఏర్పాటు చేసిన రజనీకాంత్ తన రాజకీయ పార్టీని డిసెంబర్ 31న ప్రకటిస్తానని చెప్పారు. ఐతే తన అనారోగ్య కారణాలు రీత్యా పార్టీని పెట్టడంలేదని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలకు మరో ఐదు నెలల సమయముంది.