శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 6 నవంబరు 2021 (15:50 IST)

పెట్రో ధరలపై సరైన సమయంలో నిర్ణయం: ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్

పెట్రో ధరలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ప్రజలకు మేలు చేకూర్చేలా మంచి నిర్ణయమే తీసుకుంటామని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. 
 
 
మరోవైపు, పెట్రో ధరల భారాన్ని తగ్గించాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఎదురవుతోంది. ఇప్పటికే భాజపా పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించగా, తెలుగు రాష్ట్రాలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ ప్రభుత్వం ఎంత మేరకు తగ్గిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. విజయవాడలో లీటరు పెట్రోల్‌ ధర రూ.110.35  కాగా.. డీజిల్‌ ధర ₹96.44గా ఉంది. ఇకపోతే, హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ.108.20, డీజిల్‌ రూ.94.62 చొప్పున విక్రయిస్తున్నారు.
 
 
9 బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్‌పై విధించే పన్నును తగ్గించాయి. ఈ జాబితాలో అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రూ. 7 తగ్గించాయి.  మరోవైపు యూపీ ఏకంగా రూ. 12 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ మాత్రం రూ. 2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.