ఆర్ఆర్ఆర్‌పై వేటు ఖాయమా? లోక్‌సభ స్పీకర్ ఏమన్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా రెబల్ ఎంపీ కె.రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీకి చెందిన లోక్‌సభ్యులు పలుమార్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. పైగా, ఆర్ఆర్ఆర్‌పై తక్షణం అనర్హత వేటు వేయాలంటూ ఒత్తిడి కూడా చేస్తున్నారు.
దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. వైసీపీ దాఖలు చేసిన రఘురామ అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు ప్రక్రియ ఉంటుందన్నారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించాకే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
పైగా, పిటిషన్ పరిశీలన తర్వాత సభాహక్కుల కమిటీకి పంపిస్తామని ఓం బిర్లా వివరించారు. సభలో నిరసన తెలిపేందుకు ఎవరికైనా హక్కు ఉంటుందని పేర్కొన్నారు. సభలో ఏదైనా అంశం ప్రస్తావనకు కొన్ని నిబంధనలు పాటించాలని అన్నారు.
రఘురామ అనర్హత పిటిషన్ పై రన్నింగ్ కామెంటరీ (ప్రత్యక్ష వ్యాఖ్యానం) చేయలేమని, పిటిషన్ పరిశీలన ప్రక్రియకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.