గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2023 (09:54 IST)

సాకులు చెప్పకుండా ఈసారైనా ఓటు హక్కు కల్పిస్తారా? లేదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్

Nimmagadda
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కు కోసం నానాపాట్లు పడుతున్నారు. గతంలో లోపభూయిష్ట విచారణ కారణంగా తాను దుగ్గిరాలలో ఓటు హక్కు పొందలేకపోయానని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం దుగ్గిరాలలో ఉంటున్నారు. ఇంటింటా ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా శనివారం తన ఇంటికి వచ్చిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) వద్ద ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఆయన దుగ్గిరాలలో ఉండటం లేదంటూ ఓటు హక్కు ఇవ్వకుండా తిరస్కరించిన సంగతి తెలిసిందే. 
 
తాను హైదరాబాద్‌లో ఉన్నా తన ఓటును 2020లోనే సరెండర్‌ చేశానని చెప్పారు. అప్పుడే దానికి సంబంధించిన అన్ని రుజువులు ఇస్తూ దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేశానని తెలిపారు. అయినా తాను స్థానికంగా ఉండటం లేదనే సాంకేతిక కారణాన్ని చూపి ఓటు హక్కు నిరాకరించారని పేర్కొన్నారు. 
 
ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు పూర్తి చేసుకున్నాక ఎక్కువ కాలం ఇక్కడే ఉంటున్నట్లు చెప్పారు. ఇక్కడే తాను పుట్టి, చదువుకున్నానని, తన తల్లి కూడా ఇక్కడే ఉంటారన్నారు. దుగ్గిరాలలో ఓటు హక్కు ఇవ్వకుండా నిరాకరించడంపై హైకోర్టుకు వెళ్లినప్పుడు అన్ని ఆధారాలతో మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించడంతో తాజాగా దరఖాస్తు సమర్పించానని చెప్పారు. ఈ దఫా అయినా కుంటి సాకులు చెప్పకుండా ఓటు హక్కును కల్పిస్తారా? లేదా? అని ఆయన బీఎల్వీవో అధికారిని ప్రశ్నించారు.