శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (10:05 IST)

రుయా ఆస్పత్రిలో మరణ మృదంగం.. రోజూ అంత మంది చనిపోతున్నారా?

రాయలసీమ ప్రాంతంలోనే ఎంతో పేరున్న తిరుపతి రుయా ఆస్పత్రిలో కోవిడ్ రోగుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ప్రతి రోజూ పదుల సంఖ్యలో చనిపోతున్నట్టు తేలింది. ముఖ్యంగా, సోమవారం రాత్రి 8.20 నుంచీ 8.40 గంటల నడుమ 20 నిమిషాల పాటు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయిన వ్యవధిలో 11 మంది ఆక్సిజన్‌ లేక ఊపిరాడక చనిపోయారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. 
 
కానీ, చనిపోయినవారు 11మందేనని సోమవారం రాత్రి కలెక్టర్‌ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 11 మందితో పాటు మరో 8 మందిని కూడా ఆ సమయంలో చనిపోయినవారి జాబితాలో చేర్చాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య 19కి పెరిగే అవకాశం ఉంది. 
 
కాగా సోమవారం ఒక్కరోజే 56 మంది చనిపోయారని రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి మీడియాకు వెల్లడించారు. ఇంత పెద్ద విషాద ఘటన జరిగినప్పుడు మృతుల వివరాలను వెల్లడిస్తారు. అయితే చనిపోయినవారి పేరు, ఊరు వంటి వివరాలతో జాబితా ఇప్పటికీ ప్రకటించనే లేదు.
 
మరోవైపు, గత నెల 18వ తేదీ రుయాలో మరణాల సంఖ్య భారీగా ఉన్నట్టు మంగళవారం చెప్పిన లెక్కలతో బయటపడింది. రుయాలో రెండు వారాల మరణాలు పరిశీలిస్తే వెన్నులో వణుకు పుడుతోంది. గతనెల 24వ తేదీ 22 మంది, 25న 25 మంది, 26న 28 మంది, 27న 33 మంది, 28న 32 మంది, 29న 37 మంది, 30న 30 మంది, ఈనెల 1న 34 మంది, 2న 28 మంది, 3న 36 మంది, 4న 28 మంది, 5న 28 మంది 6వ తేదీ 30 మంది వరకు కొవిడ్‌తో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. కానీ రుయా ఆస్పత్రితో పాటు.. ప్రభుత్వం కూడా ఈ లెక్కలను దాచిపెడుతోంది.