శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (17:53 IST)

ఎన్నికలకు ముందే జైలుకి వెళ్తాడనే భయం.. అందుకే జగన్ పాదయాత్ర: సోమిరెడ్డి

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌లో ఎలాంటి మార్పు రాలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పరుష పదజాలంతో మాట్లాడి కేసులు పెట్టించుకున్న జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌లో ఎలాంటి మార్పు రాలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పరుష పదజాలంతో మాట్లాడి కేసులు పెట్టించుకున్న జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. పరిణతిలేని నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టమని, అసెంబ్లీ బహిష్కరణ అందుకు నిదర్శనమని సోమిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలను ఎలుగెత్తాల్సిన బాధ్యత కలిగిన ప్రతిపక్షం శాసనసభను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవటం బాధాకరమన్నారు. 
 
జగన్‌ అవినీతి గురించి ఇంతవరకూ జాతీయస్థాయి వరకే తెలుసని, తాజాగా ప్యారడైజ్‌ పేపర్ల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆయన అవినీతి చరిత్రకెక్కిందని వ్యాఖ్యానించారు. బెంగళూరులో 29 ఎకరాల్లో భారీ భవంతిని నిర్మించుకున్న జగన్‌.. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌.. అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిలో నిండా మునిగిన జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎలా విమర్శలు చేస్తారు? అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. 
 
జగన్‌ పాదయాత్ర చేసినా, మోకాళ్ల యాత్ర చేసినా టీడీపీకివచ్చే నష్టమేవిూ లేదని సోమిరెడ్డి అన్నారు. తనను గెలిపిస్తే రాజన్న పాలన్న తీసుకొస్తానని జగన్ రెడ్డి చెప్తున్నారని.. వేల ఎకరాల పేదల భూములను సెజ్‌ల పేరుతో లాక్కొని రైతులను నట్టేట ముంచడమేనా రాజన్న పాలనా అంటూ అడిగారు. ఎన్నికలకు ముందే జైలుకి వెళ్తానేమోనన్న భయంతో జగన్‌ పాదయాత్ర నాటకానికి తెరతీశారని దుయ్యబట్టారు. 
 
పాదయాత్ర పేరుతో అరాచకాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే వైసీపీ, జగన్‌ పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. జగన్‌ పాదయాత్ర వల్ల తమ పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని తెలిపారు.