మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (11:29 IST)

తిరుమల పర్యటనకు వెళ్లనున్న జగన్... తిరుపతిలో సెక్షన్ 30 అమలు

jagan
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. జగన్ షెడ్యూల్ వివరాలను వైసీపీ ప్రకటించింది.
 
ఈ షెడ్యూల్ ప్రకారం వైఎస్ జగన్ సెప్టెంబర్ 27వ తేదీన సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు బయలుదేరుతారు. 
 
శుక్రవారం రాత్రి 7 గంటలకు జగన్ తిరుమలకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 28వ తేదీన శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల ఆలయానికి వెళ్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11.30 గంటలకు ఆలయం నుంచి గెస్ట్ హౌస్‌కు బయలుదేరుతారు. 
 
ఆ తర్వాత 11.50 గంటలకు తిరుమల నుంచి రేణిగుంటకు వెళతారు. 1.20 గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.30 గంటలకు రేణిగుంట నుంచి బెంగళూరులోని తన నివాసానికి జగన్ వెళ్తారు. 
 
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సెప్టెంబరు 25వ తేదీ నుంచి అక్టోబరు 24వ తేదీ వరకు నెల రోజులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంటుందన్నారు. 
 
ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. 
 
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా బహిరంగ సభలు లేదా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయాలంటే లిఖిత పూర్వకంగా స్థానిక పోలీసు అధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని.. పోలీసులు ముందస్తు అనుమతి ఇస్తేనే కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.