సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (17:16 IST)

నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డి పై చర్యలకు ఈసీ ఆదేశం

raghuveer reddy
నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్ఓపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాలలో సినీ నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. నంద్యాల ఎమ్మెల్యే, వైకాపా అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి శనివారం ఉదయం అల్పాహారానికి అల్లు అర్జున్ వచ్చారు. 
 
వైకాపా శ్రేణులు వ్యూహాత్మకంగా పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లుచేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండగా ఇంచుమించు అదేసమయంలో హీరో అర్జున్ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లా ఎస్పీపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.