బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (16:51 IST)

ఆంధ్రాలో పరీక్షల టైంటేబుల్ వెల్లడి.. జూన్ 7 నుంచి టెన్త్ ఎగ్జామ్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పరీక్షల టైంటేబుల్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇందులోభాగంగా, జూన్ 7వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు ఉంటాయన్నారు. సైన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయన్నారు. జులై 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందన్నారు.  
 
ఇదిలావుంటే, ఏప్రిల్‌ 15 నుంచి స్కూళ్ళల్లో  రెండో విడత నాడు - నేడు పనులను ప్రారంభంకానున్నాయి. డిసెంబర్‌ 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందిచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 
 
రెండో విడత నాడు - నేడు కోసం సుమారు 4,446 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించి, టాయిలెట్ల నిర్వహణకు సులభ్‌ ఇంటర్నేషనల్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు.
 
ఇక నుంచి స్కూళ్లకు ప్రత్యేక యాప్ ఉండనుంది. ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి రానుంది. పిల్లల హాజరు వివరాలను యాప్‌ ద్వారా అధికారులు సేకరించనున్నారు. స్కూల్‌కు పిల్లలు వెళ్ళకపోతే తల్లిదండ్రులకు యాప్ ద్వారా మెసేజ్ చేయనున్నారు. రెండో రోజు రానట్లైతే స్వయంగా వాలంటీర్లు వెళ్లి వాకబు చేస్తారని మంత్రి వివరించారు.