ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (21:56 IST)

టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం

టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిపట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందం మంగళవారం రాత్రి టీడీపీ కార్యాలయాన్ని సందర్శించింది. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసింది.

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్  ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ (అడ్మిన్ ఇంఛార్జ్ ) నూతలపాటి రవికాంత్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, తాడికొండ ఇంచార్జి చిలకా విజయ కుమార్,  గుంటూరు జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ , మంగళగిరి నియోజక వర్గ ఇంచార్జి షేక్ సలీం ఘటనా స్థలాన్ని సందర్శించారు.

తదనంతరం పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరింది.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని ఈ ప్రతినిధి బృందం సూచించింది. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
 
ఇలాంటి ఘటనలు ముందే ఊహించాం: తులసిరెడ్డి
రాష్ట్రంలో వైసీపీ  అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ముందే ఊహించామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. పాలక పార్టీ శ్రేణులు టిడిపి కేంద్ర కార్యాలయంపైన, వివిధ జిల్లాల్లో టిడిపి కార్యాలయాలు, నాయకుల ఇళ్ల వద్ద ఆందోళనలు, దాడులు నిర్వహించడం శోచనీయమని పేర్కొన్నారు. 

విజయవాడలో పట్టాభి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం అమానుషమని తులసిరెడ్డి అన్నారు. విమర్శలు నిర్మాణాత్మకంగా, సద్వివిమర్శలుగా ఉండేలా సంయమనం కోల్పోకుండా విమర్శలు చేయాల్సిన బాధ్యతను ఎవ్వరూ విస్మరించకూడదన్నారు.

సద్విమర్శలను కూడా భరించలేని వాతావరణం నెలకొనడం ప్రజాస్వామ్య వ్యవస్థకే హాని చేస్తుందని, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు విమర్శలు చేస్తే భౌతిక దాడులు చేసే అప్రజాస్వామిక చర్యలకు పాలక పార్టీ శ్రేణులు పాల్పడితే శాంతి భద్రల సమస్యకు వారే ఆజ్యంపోసిన వారౌతారని, డిజిపి ఆఫీసు ప్రక్కనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే దాడి చేస్తే నివారించలేని దుస్థితి దేనికి అద్దం పడుతున్నదో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని కోరారు.

అధికారంలో ఉన్నవారు అణిగి మణిగి ఉండాలి కానీ, రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే ప్రయత్నం చేయడం శోచనీయమని పేర్కొన్నారు. శాంతి భద్రతలు ఇంతగా దిగజారుతున్నా పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని తులసిరెడ్డి ప్రశ్నించారు. వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించి దీని వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దని అన్నారు.