బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (13:31 IST)

పార్టీకి ఫుల్‌టైమ్ అధ్యక్షురాలిని నేనే... సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీకి ఫుల్‌టైమ్ అధ్యక్షురాలిని తానేనంటూ సోనియా గాంధీ ప్రకటించారు. ప్రస్తుతం ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతూ వచ్చారు. కానీ, తాజాగా పార్టీకి తానే ఫుల్ టైం అధ్యక్షురాలినని ఆమె స్పష్టం చేశారు.
 
శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పార్టీ నేతలకు ఆమె ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. మీటింగ్ తర్వాత దీనిపై ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. పరోక్షంగా ‘జీ23’ నేతలకు ఓ హెచ్చరికలా స్పష్టతనిచ్చారు. పార్టీ నిర్మాణం, పోరాటాల్లో యువ నేతలు చాలా కీలకంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
 
వ్యవసాయ చట్టాలు, కరోనా పరిహారం, దళితులపై దాడులు, ప్రజా సమస్యలపై యువనేతలు బాగా పోరాడుతున్నారని, ఏదైనా సవాల్‌గా తీసుకుంటున్నారని ఆమె కొనియాడారు. జీ23 నేతలనుద్దేశించి తనతో ఎవరైనా నేరుగా మాట్లాడవచ్చని, మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా స్వేచ్ఛగా, నిజాయతీగా చర్చించవచ్చని తెలిపారు.
 
అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టిస్తోందని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఉద్యమం చేబట్టి ఏడాది దాటినా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.