నేటి నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర
రాజధాని నిర్మాణం భూములిచ్చిన అమరావతి రైతులు సోమవారం నుంచి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వెంకటపాలెంలో తితిదే ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఈ యాత్రను ప్రారంభించారు. అమరాతి ఉద్యమం ప్రారంభమై సోమవారంతో వెయ్యి రోజులు పూర్తికానుంది. దీన్ని పురస్కరించుకుని అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ యాత్ర సాగుతుంది.
కాగా, నవ్యాంధ్రకు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు గత వెయ్యి రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఇది వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. దీన్ని పురస్కరించుకుని ఈ మహాపాదయాత్ర 2.0కు సోమవారం ఉదయం అంకురార్పణ జరిగింది.
ఈ తెల్లవారుజామున వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు అనంతరం ఆలయం బయట ఉన్న వేంకటేశ్వరస్వామి వారి రథాన్ని నడిపి పాదయాత్రకు అంకురార్పణ చేశారు. అనంతరం రథాన్ని గ్రామంలోకి తీసుకెళ్లారు. ఉదయం 9 గంటలకు జెండా ఊపి పాదయాత్రను లాంఛనంగా ప్రారంభించారు.
అంకురార్పణ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అమరావతి పరిరక్షణ సమితి, రైతు జేఏసీ నేతలు పాల్గొన్నారు. వెంకటపాలెంలో ప్రారంభం కానున్న రైతుల మహాపాదయాత్ర 1000 కిలోమీటర్లు సాగి నవంబరు 11న శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి చేరుకుంటుంది.