ఏపీలో భూముల రీ సర్వే ప్రక్రియ.. కొత్త పథకానికి జగన్ శ్రీకారం
ఏపీలో భూముల రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 'వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం' పేరుతో భూముల సమగ్ర రీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు వద్ద సర్వేరాయి పాతి ఈ పథకాన్ని సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్వే కోసం వినియోగించే పరికరాలను, వాటి ఫలితాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రెవన్యూ, సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో చేపట్టి 2023 జనవరి నాటికి పూర్తి చేయాలని జగన్ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. తొలి దశలో 5,122 గ్రామాల్లో సర్వే చేపడతారు. రెండో దశలో 6000 గ్రామాల్లో సర్వే జరుగుతుంది. చివరి దశలో మిగిలిన గ్రామాల్లో ఈ సర్వే జరుపుతారు. దీని ద్వారా దీర్ఘకాలంగా నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించవచ్చని జగన్ సర్కారు భావిస్తోంది.