శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (18:20 IST)

ఆరు దాటితే మందు బంద్‌: ఆ బ్రాండ్ల‌కు బ్యాండ్‌..!

ద‌శ‌ల‌వారీ మ‌ద్య‌పాన నిషేధంలో భాగంగా కీల‌క అడుగులు. వేల కోట్లు ఆదాయ‌న్ని తెచ్చి పెట్టే మ‌ద్యం అమ్మ‌కాలపై నియంత్ర‌ణ‌. సాయంత్రం అయితే చాలు.. బార్లు.. వైన్ షాపుల ముందు కిక్కిరిసే మందుబాటులు ఆ అవ‌కాశం కోల్పోతున్నారు. సాయంత్రం ఆరు గంట‌లు దాటితే ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాలు బంద్ చేసే ప్ర‌తిపాద‌న సిద్ధమైంది. 
 
ప్రభుత్వ కార్యాల‌యాల త‌ర‌హాలోనే ఉద‌యం 10 గంట‌ల నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌రకు మాత్ర‌మే మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌నున్నాయి. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన బ్రాండ్ల‌ను సైతం త‌గ్గించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసింది. వీటికి అధికారికంగా ఆమోదం ల‌భిస్తే ఇక మ‌ద్యం బాబులు సాయంత్రం ఏం చేయాలో...?? 
 
సాయంత్రం ఆరు దాటితే మందు క్లోజ్..! 
తాను అధికారంలోకి వ‌స్తే ఏపీలో మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు చేస్తాన‌ని ఎన్నిక‌ల వేళ వైకాపా అధినేత జ‌గ‌న్ హామీ ఇచ్చారు. న‌వ‌ర‌త్నా ల్లోనూ ప్ర‌కటించారు. ఐదేళ్ళ కాలంలో ద‌శ‌ల వారీగా మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తూ.. కేవ‌లం స్టార్ హోట‌ళ్లలో మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తాన‌ని స్ప‌ష్టం చేసారు. దీనిలో భాగంగా ఏపీలో మ‌ద్యం వినియోగాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించేందుకు కీల‌క ప్ర‌తిపాద‌న‌లు సిద్దం అయ్యాయి. 
 
ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల మేర‌కు వీటిని అధికారులు సిద్దం చేసారు.. అందులో భాగంగా ఇక నుండి ఏపీలో మ‌ద్యం విక్ర‌యాలు ప్ర‌స్తుతం ఉద‌యం 10 గంట‌ల నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఉండ‌గా.. ఇక నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కే ప‌రిమితం చేయ‌నున్నారు. అక్టోబరు నుంచి అమ‌ల్లోకి వ‌చ్చే కొత్త ఎక్సైజ్ పాల‌సీలో ఈ ప్ర‌తిపాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. మందుప్రియులు అధికంగా రాత్రే మద్యం తాగు తారు.ఆ సమయంలో షాపులు మూసేస్తే చాలావరకు అమ్మకాలు తగ్గుతాయనేది ప్రభుత్వం అంచనా. 
 
ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లోనే దుకాణాలు.. ఇదేస‌మ‌యంలో అక్టోబ‌ర్ నుండి అమ‌ల్లోకి రానున్న కొత్త ఎక్సైజ్ పాల‌సీలో మ‌రిన్ని కొత్త ప్రతిపాద‌న‌లు సిద్దం అయ్యాయి. అందులో భాగంగా.. ఇక నుంచి మ‌ద్యం షాపులను ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే దాదాపు నిర్ణ యానికి వ‌చ్చారు. షాపుల నిర్వహణ కోసం సిబ్బందిని నియమించుకోనుంది. సమయాన్ని తగ్గిస్తే సిబ్బంది పనివిధానం కూడా సులభతరం అవుతుందనేది మరో ఆలోచన. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అంటే రెండు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది. 
 
కానీ అది ప్రభుత్వానికి అదనపు భారం అవుతుంది. అందువల్ల సాయంత్రం 6గంటల వరకు అమ్మకాలను కుదిస్తే ఒకే షిఫ్టుతో సిబ్బందితో పనిచేయించుకోవచ్చ‌ని.. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ద‌శ‌ల వారీ మ‌ద్య నిషేధంలో భాగంగా ఈ నిర్ణ‌యం ప్ర‌భుత్వానికి ఇమేజ్ తెచ్చి పెడుతుంద‌ని భావిస్తున్నారు. దీని పైన అధికారులు మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని నిర్ణ‌యించారు.