సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (16:31 IST)

రూల్ నంబర్ 154 కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదు... షరీఫ్ చెంతకు చేరిన ఫైలు

పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు), సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ పంపించారు. అయితే, ఈ బిల్లుల కోసం సెలెక్ట్ కమిటీ వేయడం సాధ్యపడదని శాసనమండలి కార్యదర్శి పేర్కొంటూ ఆ ఫైలును తిరిగి మండలి ఛైర్మన్‌కే పంపినట్టు సమాచారం. రూల్‌ 154 కింద కమిటీ వేయడం చెల్లదని ఫైలు మీద రాసినట్లు సమాచారం. 
 
ఈ పరిస్థితుల్లో శాసనమండలి కార్యదర్శిని టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్‌ పక్షాలు కలిశాయి. రూల్‌ 154 కింద చైర్మన్‌ ప్రకటన ఉంటుందని, ఆ ప్రకటనకు అనుగుణంగానే కమిటీ వేయాల్సి ఉంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. ఛైర్మన్‌ నుంచి ఫైలు వచ్చిన వెంటనే కమిటీ వేయని పక్షంలో ఈ సారి మండలి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఉదయం నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు. 
 
మరోవైపు సీఆర్డీయే బిల్లు రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు విషయంలో ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీ వివాదం ఇంకా కొనసాగుతోంది. దీనికోసం టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, నాగజగదీష్, అశోక్‌బాబు, బచ్చుల అర్జునుడు తదితరులు మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను కలిశారు. 
 
సెలక్ట్ కమిటీని తక్షణం వేయాలని, దానికి సంబంధించి ఛైర్మన్ ఆదేశాలను పాటించాలని కార్యదర్శిని కోరారు. అయితే, ఈ ఆదేశాలను ప్రభుత్వ ఒత్తిడితో మండలి కార్యదర్శి తోసిపుచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.