సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (08:58 IST)

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వం ఒక నోట్‌ను తయారు చేసి మంత్రులకు ఆన్‌లైన్‌లో పంపించింది. దీనికి మంత్రులంతా ఆన్‌లైన్‌లో ఆమోదముద్ర వేశారు. ఈ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అధికార నోటిఫికేషన్ నేడో రేపో వెల్లడికానుంది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఒక్కో జిల్లాగా ఏర్పాటుకానున్నాయి. అరకు లోక్‌సభ స్థానాన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించారు. దీనికి కారణం విస్తీర్ణంలో ఇతర జిల్లాలతో పోల్చితే పెద్దదిగా ఉండటమే. 
 
ఇదిలావుంటే, కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు ఆన్‌లైన్‌లో పంపి వారి ఆమోదం తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇదే అంశంపై జిల్లా కలెక్టర్లతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించారు. తన ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీని రూపొందించిన నివేదికను సమీర్ శర్మ జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. 
 
ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో అధికారికంగా నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది.