శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (16:50 IST)

ఏపీని ప్రపంచ స్థాయి రాష్ట్రంగా మార్చుతాం : మేకపాటి గౌతమ్ రెడ్డి

ఏపీని ప్రపంచస్థాయి రాష్ట్రంగా మార్చడమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని ఏపీ పరిశ్రమల శాఖామంత్రి మోకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. దీన్ని త్వరలోనే ఆచరణలో పెడతామని తెలిపారు. భారత విదేశాంగ శాఖ సమన్వయంతో విజయవాడలో జరుగుతున్న డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ సదస్సుకు విచ్చేసిన అతిథులందరికీ ఆయన సాదరస్వాగతం చెబుతున్నట్టు తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా భారత విదేశాంగ శాఖ 35 దేశాల దౌత్యవేత్తలు, ప్రతినిధులతో తొలిసారిగా ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. పారదర్శక పాలన అందించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. 
 
ఆంప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 25  దేశాలు పెట్టుబడులు పెట్టి, ఉత్పత్తులను తయారు చేస్తున్నాయన్నారు. ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కింగ్ డమ్, సింగపూర్, కొరియా, చైనా దేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో  ఇప్పటికే వివిధ రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పాయని తెలిపారు. 
 
ఆహార ఉత్పత్తి రంగంలో భారీ పరిశ్రమల స్థాపనకు జర్మనీ ఆసక్తిగా ఉందన్నారు. మొట్టమొదటిసారి రిపబ్లిక్ దేశాలు కూడా పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయన్నారు. ఇతర దేశాలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆటో కంపొనెంట్ రంగాలలో పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేయనున్నట్టు తెలిపారు. 
 
పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. పరిశ్రమలను విస్తృతంగా తీసుకువచ్చి, యువతకు ఉపాధి అందించడంతోపాటు రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.