గురువారం, 27 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (14:33 IST)

ఏసీ గదుల్లో కూర్చొని అమరావతిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు : మంత్రి నారాయణ

Narayana
ఏసీ గదుల్లో కూర్చొని నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ అన్నారు. రాజధాని పరిధిలోని నేలపాడులో గెజిటెడ్‌ అధికారుల ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై సీఆర్‌డీఏ ఇంజినీర్లు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని సూచించారు. 
 
'అమరావతి మునిగిపోయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారు. రాజధాని నిర్మాణానికి మిగతా భూమిని భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. భూసేకరణ కంటే భూసమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభం. గెజిటెడ్‌ అధికారులకు 14 టవర్స్‌లో 1,440 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. టైప్‌-1లో 384 ఇళ్లు, టైప్‌-2లో 336 ఇళ్లు నిర్మిస్తున్నాం. 
 
గ్రూప్‌-డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నాం. డిసెంబర్‌ 31 లోగా అన్ని టవర్లు పూర్తి చేస్తాం. అమరావతిలో రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి నాటికి నిర్మాణం పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తాం. ఐఏఎస్‌ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. ట్రంక్‌ రోడ్డు, లేఅవుట్‌ రోడ్లు, ఐకానిక్‌ టవర్ల పనులు జరుగుతున్నాయి' అని నారాయణ వివరించారు.