పండక్కి ఊరెళుతున్నారా.. ప్రయాణికులకు షాకిచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ
సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రజల (ప్రయాణికులు)కు ఏపీఎస్ఆర్టీసీ తేరుకోలేని షాకిచ్చింది. హైదరాబాద్ నగరం నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు కేవలం 240 బస్సులు మాత్రమే నడుపనున్నట్టు ప్రకటించింది. దీంతో పండక్కి సొంతూర్లకు వెళ్లాలని భావించే వారికి ఇక్కట్లు తప్పవని తెలుస్తోంది.
సంక్రాంతి పండుగ వేళ గ్రామాలకు, శివరాత్రి శైవక్షేత్రాలకు, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతికి ప్రత్యేక బస్సులు నడపడం ఆనవాయితీ. అయితే, గత రెండేళ్లుగా దిక్కులేనిదైన ఏపీఎస్ ఆర్టీసీ తన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి.
సంక్రాంతికి ముందు 3857 సర్వీసులు, తర్వాత వెనుదిరిగే ప్రయాణికుల కోసం 4575 సర్వీసులు కలిపి మొత్తం 8432 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఆపరేషన్స్ విభాగం ఈడీ అప్పల్రాజు ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ, కర్నాటక, తమిళనాడు నుంచి వచ్చే వారికోసం 375 బస్సులు మాత్రమే నడుపుతున్నట్టు ఈ ప్రకటనను బట్టి తెలుస్తోది. ఇందులో హైదరాబాద్ నుంచి విజయవాడ, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, విశాఖపట్టణం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు సంక్రాంతికి వచ్చేవారి కోసం 240 బస్సులు మాత్రమే నడుపనున్నారు. మిగిలిన వాటిలో బెంగుళూరు నుంచి 102 బస్సులు, చెన్నై నుంచి కేవలం 15 అదనపు సర్వీసులు నడుపనున్నారు.